Dhoni World Cup 2023 News :ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచ కప్ 2023లో టీమ్‌ఇండియా వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించి దూసుకెళ్తోంది. మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. లఖ్‌నవూ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన, అతడు జట్టును నడిపిస్తున్న తీరుతో.. మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్ కూల్ ధోనీ మొదటి భారత్ విజయావకాశాలపై స్పందించాడు. దీంతో పాటే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడటంపైనా కూడా ఓ హిట్ ఇచ్చాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"ప్రస్తుతం ప్రపంచ కప్‌లో ఆడుతున్న టీమ్‌ఇండియా చాలా బాగుంది. సమతూకంగా అన్ని విభాగాలూ పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్పలేను. కచ్చితంగా మనకు మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. 2019లో కాస్తలో ఓడిపోయి సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడం ఇప్పటికీ బాధగానే ఉంది. అలాంటి ఎమోషన్స్‌ను నియత్రించుకోవడం చాలా కష్టమే. టీమ్ ఇండియా తరఫున ఇదే నా చివరి మ్యాచ్ అయింది. అప్పటికే నేను గుడ్ బై చెప్పేయాలని భావించాను. ఏడాది తర్వాత అనౌన్స్ చేశాను. దాదాపు 15 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి వీడ్కోలు చెప్పడం చాలా బాధగా అనిపించింది. అయనా ఎప్పుడో ఒకప్పుడు అలాంటి రోజు ప్రతి క్రికెటర్ కెరీర్‌లో రావాల్సిందే" అని ఆయన అన్నారు.