టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడింది టీమ్ఇండియా(Ind vs Aus Warm-up Match). ఈ మ్యాచ్ నేపథ్యంలో చోటుచేసుకున్న ఓ దృశ్యం క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. నేడు(అక్టోబర్ 20న) జరిగిన మ్యాచ్ సమయంలో రిషబ్ పంత్ కీపింగ్ పాఠాలు నేర్చుకున్నాడు. అతడికి పాఠాలు నేర్పింది మరెవరో కాదు.. టీమ్ఇండియా మాజీ సారథి, మెంటార్ ఎంఎస్ ధోనీ(Dhoni Mentor).
ఆసీస్తో వార్మప్ మ్యాచ్లో నాలుగు ఓవర్ల ఆట ముగిసిన తర్వాత సైడ్ స్క్రీన్ సమస్య కారణంగా ఆటకు కొంత విరామం లభించింది. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బౌండరీ లైన్ వద్ద కీపింగ్ పాఠాలు నేర్చుకుంటూ కనిపించాడు. వికెట్ మధ్యలో ఉంచి, ధోనీ బంతి విసురుతుండగా పంత్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో కెమెరాలన్నీ ఒక్కసారిగా వారి వైపు తిరిగాయి.
అనంతరం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.