Dhoni Sehwag: 2008లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో నాటి భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ కొన్ని మ్యాచ్‌లకు తనను తప్పించడంతో వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. అప్పుడు తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా సచిన్ తెందూల్కర్ అడ్డుకున్నాడని సెహ్వాగ్ వివరించాడు.
"2008లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఆలోచన నా మదిలో మెదిలింది. అప్పటికి టెస్టు సిరీస్‌లో పునరాగమనం చేసి 150 పరుగులు చేశాను. వన్డేల్లో మూడు-నాలుగు ప్రయత్నాల్లో అంత స్కోరు చేయలేకపోయా. కాబట్టి ధోనీ నన్ను తుది జట్టు నుంచి తప్పించాడు. అప్పుడు వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలనే ఆలోచన నా మదిలోకి వచ్చింది. టెస్టు క్రికెట్‌లో మాత్రమే ఆడాలనుకున్నాను. ఆ సమయంలో సచిన్ నన్నుఅడ్డుకున్నాడు. 'ఇది నీ జీవితంలో ఒక చెడు దశ. వేచి చూడు. ఈ పర్యటన తర్వాత ఇంటికి వెళ్లి ఏం చేయాలో బాగా ఆలోచించి ఆపై నిర్ణయం తీసుకో' అని సలహా ఇచ్చాడు. అదృష్టవశాత్తూ నేను ఆ సమయంలో నా రిటైర్మెంట్‌ని ప్రకటించలేదు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.