Dhoni Raina Funny Incident : చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది ధోనీ రైనా రిలేషన్షిప్. టీమ్ఇండియాకు సేవలందించిన ఈ స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్‌లోనూ తమ జట్టుకు కీలక విజయాలను అందించారు. ఈ ద్వయం బ్యాట్ పట్టి క్రీజులోకి వచ్చిందంటే ఇక పరుగుల వరద ఖాయమంటూ యెల్లో ఆర్మీ సంబరాలు చేసుకుంటుంది. అయితే ఈ ఇద్దరూ మైదానంలోనే కాకుండా బయట కూడా మంచి స్నేహితులు.
అయితే ఈ ఇద్దరూ ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత చెన్నై జట్టుకు ఆడిన రైనా ప్రస్తుతం బ్యాట్ వదిలేసి క్రికెట్ ఎక్స్‌పర్ట్‌గా మారాడు. క్రికెట్‌కు సంబంధించిన షోస్, ఇంటర్వ్యుల్లో పాల్గొని సందడి చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో పాటు యాంకర్లకు ధోనీకి తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్తుంటాడు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ధోనీకి మధ్య జరిగిన ఓ ఫన్నీ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. అందులో తనను ధోనీ పెళ్లికి ఎలా పిలిచాడో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
"ధోనీ ఒక రోజు నాకు సడెన్‌గా కాల్ చేశాడు. ఎక్కడున్నావని అడిగాడు. నేను వెంటనే లఖ్‌నవూలో ఉన్నానని చెప్పాను. దానికి అతడు నాకు డెహ్రాదున్లో పెళ్లి జరుగుతోంద. నువ్వు ఇక్కడికి రా. ఈ విషయాన్ని ఇంకెవరికీ చెప్పకు. నేను నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పాడు. దీంతో నేను మాములు డ్రెస్‌లోనే అక్కడికి వెళ్లాను. ఆ తర్వాత ధోనీ డ్రెస్ వేసుకుని పెళ్లికి హాజరయ్యా" అని రైనా అప్పటి ఘటనను గుర్తుచేసుకుని నవ్వుకున్నాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్ కూడా నవ్వుకుంటున్నారు. ఈ ఇద్దరి రిలేషన్షిప్ ఎంతో స్ట్రాంగ్ అంటూ కొనియాడుతున్నారు.