ఐపీఎల్ 2023 16వ సీజన్ సందడి మొదలైంది. ఈ నెల 31న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లు మైదానంలో తమ సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా తమ క్యాంపులకు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించేశారు. అయితే ముఖ్యంగా ఈ మెగాటోర్నీలో క్రికెట్ ఫ్యాన్స్ అందరీ దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపైనే ఉంది. మహీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రోఫీని ముద్దాడి అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే ప్లానింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఎమ్ ఎస్ ధోనీ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించేశాడు.
ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్స్‌ను చూసేందుకు అభిమానులకు అనుమతించారు నిర్వాహకులు. అయితే తాజాగా చెపాక్ స్టేడియంలో మహీ ప్రాక్టీస్ చేస్తుండగా.. అతడి నామస్మరణంతో మైదానం మారుమోగిపోయింది. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టగానే.. అభిమానుల కేరింతలు, ఈలలు, అరుపులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.
నిజంగా మ్యాచ్ జరుగుతుందా అన్నంతగా.. 'ధోని ధోని' అని అరూస్తూ వేలాది మంది ప్రేక్షకులు హంగామా చేశారు. ఈ వీడియోను ఐపీఎల్ సీఎస్కే.. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దానికి 'హీరో మళ్లీ వస్తాడు' అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు మహీ అభిమానులు. ఈ వీడియోలో మహీ.. గ్లోవ్స్ ధరిస్తూ బ్యాట్ పట్టుకుని స్టైలిష్‌గా మైదానంలోకి ఎంట్రీ ఇస్తూ కనిపించాడు. ఇది చూసిన ఓ అభిమాని కేజీయఫ్ స్టైల్‌లో మహీ ఎంట్రీ అదిరిపోయిందిగా అంటూ కామెంట్ చేశాడు. ఈ ఐపీఎల్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్, అతడికి ఉన్న క్రేజ్ ఇతర ఏ ఆటగాడికి లేదంటూ మరొక అభిమాని పేర్కొన్నాడు.