Dhoni Mohammad Shahzad : తన కెప్టెన్సీతో పాటు ఫ్రెండ్రీనెస్తో కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ పేరు వింటే ఎంతో మంది అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటారు. ప్లేయర్లకు దిశా నిర్దేశం చేసే ఓ మంచి వ్యక్తి అంటూ ధోనీని కొనియాడుతుంటారు. దీంతో తనతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరూ మిస్టర్ కూల్ గురించి ఏదో ఒక ఆసక్తికరమైన విషయం చెప్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ తనకు, ధోనీకి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
"2018 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఆ తర్వాత ధోనీ, నేను కాసేపు ముచ్చటించాం. ధోని ఓ గొప్ప కెప్టెన్. భారత క్రికెట్‌కు అతడు దేవుడిచ్చిన ఓ బహుమతి. తనతో మాట్లాడుతున్న సమయంలో నేను మా టీమ్ మెంబర్ ముహమ్మద్ షహ్జాద్ గురించి కూడా చెప్పాను. షహ్జాద్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అంటూ నేను చెప్పాను. అయితే, షహ్జాద్‌ది భారీ కాయమని, అతడు ఓ 20 కేజీల బరువు తగ్గితే తాను అతడ్ని ఐపీఎల్ జట్టులోకి తీసుకుంటానంటూ ధోని సరదాగా అన్నాడు. అయితే సిరీస్ తర్వాత షహ్జాద్ మరో ఐదు కేజీల బరువు పెరిగాడు" అని అస్గర్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.