Dhoni Jersey No 7 :బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ధోనీ జెర్సీ నంబర్ 7ను రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం ఇకపై ఈ నెంబర్‌తో టీమ్ఇండియాలో మరో జెర్సీ ఉండదు. అంతే కాకుండా మరే భారత క్రికెటర్ ఈ నెంబర్ జెర్సీని వేసుకోకూదడు. అయితే ఇప్పటి వరకు ఈ గౌరవం సచిన్ టెండుల్కర్‌కు మాత్రమే దక్కింది. సచిన్ జెర్సీ నంబర్ 10ను రిటైర్ అవుతున్నట్లు గతంలో బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'జెర్సీ నెంబర్ 7'కి ఈ గౌరవం దక్కింది.
"ఎంఎస్ ధోనీ ఏడో నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ ఎంపిక చేసుకోవద్దని ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లకు చెప్పాం. భారత క్రికెట్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన మహీ జెర్సీకి వీడ్కోలు పలకాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం అందుకు కారణం. ఇకపై కొత్త ఆటగాళ్లు నెంబర్ 7 జెర్సీని ధరించలేరు. ఇప్పటికే 10వ నంబర్ జెర్సీని పక్కన పెట్టేశాం. ప్రస్తుతం ప్లేయర్ల కోసం 60 సంఖ్యలు ఉన్నాయి. ఒకవేళ ఏ ప్లేయర్ అయినా ఏడాదికాలం పాటు జట్టుకు దూరమైతే అతడి జెర్నీ నెంబర్‌ను కొత్తవాళ్లకు ఇవ్వం. అప్పుడు అరంగేట్రం చేసేవాళ్లు 30 నెంబర్లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తుంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. 'ఎమ్ ఎస్ ధోనీ అంతర్జాతీయ స్థాయిలో టీమ్ఇండియాకు సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం. జెర్సీ నెం.7 అనేది ధోనీ గుర్తింపు, ఈ బ్రాండ్‌కు ఉన్న వ్యాల్యూ తగ్గకుండా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం గర్వించదగినది' అని అన్నారు.