Dhoni Dinesh karthik: ప్రస్తుత భారత జట్టులో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిలా యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఆటగాళ్లు లేకపోవడం వల్ల.. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లాంటి స్పిన్నర్లు విఫలమవుతున్నారని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ అన్నాడు. మైదానంలో మహీ ఇచ్చే సలహాలు యువ ఆటగాళ్లకు చాలా ప్రయోజనకరమని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకంగా వ్యవహరించిన యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ.. ప్రస్తుతం ఫామ్‌లేమీతో సతమతమవుతున్నారు. వారి వైఫల్యానికి గల కారణాలను దినేశ్ కార్తిక్ విశ్లేషించాడు.
"ధోని అందించిన ప్రోత్సాహంతోనే యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ భారత జట్టులో కీలక స్పిన్నర్లుగా ఎదిగారు. బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడుతున్నప్పుడూ.. వికెట్ల వెనుక నుంచి ధోని ఇచ్చే సలహాలు వాళ్లిద్దరికీ బాగా ఉపయోగపడేవి. ధోని సలహా మేరకు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులేస్తూ వికెట్లు పడగొట్టేవారు. చాలా మ్యాచులకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించినా.. యువ ఆటగాళ్లకు మాత్రం ధోనినే అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చేవాడు. ధోనిపై వారికి అపార నమ్మకం ఉండేది. ఆటగాళ్లెవరైనా మెరుగ్గా రాణిస్తున్నంత కాలం ఎవరూ వేలెత్తి చూపరు. కానీ, 2019 ప్రపంచకప్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువ ఆటగాళ్లు పూర్తి స్థాయి క్రికెటర్లుగా ఎదిగేందుకు ధోని అందించిన సహకారం మరువలేనిది" అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.
ఫామ్‌లేమి కారణంగా గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో కూడా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను పక్కన పెట్టారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు వన్డేల్లో కలిపి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.