IPL 2022 CSK vs SRH: సీజన్‌కు ముందు కెప్టెన్సీ వదిలేసిన ఎంఎస్ ధోనీ మళ్లీ సారథ్య బాధ్యతలను స్వీకరించి చెన్నైకి విజయం అందించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 13 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 189 పరుగులకే పరిమితమైంది ఎస్ఆర్హెచ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ (47) రాణించినా.. మిడిలార్డర్ విఫలమైంది. నికోలస్ పూరన్ (64*) ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేశ్ (4 వికెట్లు) అదరగొట్టాడు. విజయం అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ, హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఉత్తమ ప్రదర్శన చేసిన ముఖేశ్ చౌదరి మాట్లాడారు.
ఎంఎస్ ధోనీ: డిఫెండ్ చేయడానికి (202) అనేది చాలా మంచి స్కోరు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభమే దక్కింది. బౌలర్లను మంచి ప్రదేశంలో బౌలింగ్ చేయమని మాత్రమే సూచించా. ఆరు ఓవర్ల తర్వాత స్పిన్నర్లు చాలా బాగా వేశారు. చివర్లో మా బౌలర్లకు ఒకే విషయం చెప్పా. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టినా.. మిగతా రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వకుండా ఉంటే మ్యాచ్‌ను గెలిచినట్లేనని. అలానే బ్యాటింగ్‌లో ఓపెనర్లు అదరగొట్టారు. జడేజా, నాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. గత సీజన్‌లోనే ఈసారి కెప్టెన్‌గా జడేజాకు అవకాశం ఇస్తామని అతడికి తెలుసు. మొదటి రెండు మ్యాచుల్లో సూచనలు ఇచ్చా. అయితే ఆ తర్వాత నుంచి జడ్డూకే నిర్ణయం తీసుకునే అవకాశం వదిలేశా. ఇప్పుడు కూడానూ బౌలింగ్, బ్యాటింగ్ సహా అన్నింటిని తనే చూసుకుంటాడు. సీజన్ ముగిసే సమయానికి కెప్టెన్సీని మరొకరు చేశారని భావించకూడదు. నిజంగా కెప్టెన్‌కు స్పూన్ ఫీడింగ్ అక్కరకు రాదు. మైదానంలో కీలక నిర్ణయాలను వారే తీసుకోవాలి. వాటికి వారే బాధ్యత వహించాలి.