భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ పేరు వినని వారుండరు. క్రికెట్లో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్న అతడు.. ప్రస్తుతం వ్యాపార రేస్‌లో దూసుకెళ్తున్నాడు. మంచి బిజినెస్‌మెన్, ఇన్వెస్టర్‌గానూ రాణిస్తున్నాడు. ఆర్గానిక్ ఫామింగ్ కూడా చేస్తున్నాడు. రాంచీలో తన వ్యవసాయ క్షేత్రంలో పండించే పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు! ఇంకా ఎన్నో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా మహీ.. ఆదాయపన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో తన రాష్ట్రం ఝార్ఖండ్ నుంచి అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారునిగా నిలిచాడు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 17 కోట్ల రూపాయలను అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాడు. కాగా, గతేడాది అడ్వాన్స్ ట్యాక్స్‌గా రూ.13 కోట్లు జమ చేశాడు. ఇక 2017-18లో రూ. 12.17 కోట్లు, 2016-17లో రూ. 10.93 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాడు.
ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం, ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఝార్ఖండ్‌లో వ్యక్తిగత విభాగంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారునిగానే ఉన్నాడు. క్రికెట్ నుంచి రిటైరయిన తర్వాత మాత్రం చాలా కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. స్పోర్ట్స్ వేర్, హోమ్ ఇంటీరియర్ కంపెనీ, బైక్ రేసింగ్ కంపెనీ.... ఇలా చాలా కంపెనీలలో పెట్టుబడులను పెట్టాడు. 'సెవెన్' పేరుతో సొంత ఫుట్‌వేర్ కంపెనీను కూడా ప్రారంభించాడు.