Dhoni Ayodhya Ram Mandir :అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం సర్వం సిద్ధమవుతోంది. జనవరి 22న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ట్రస్టు సభ్యులు ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. తాజాగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఈ ఆహ్వాన పత్రిక అందింది. ఆర్‌ఎస్‌ఎస్ కో ప్రోవిన్స్ సెక్రటరీ ధనంజయ్ సింగ్ స్వయంగా ధోనీని ఆయన నివాసంలో కలిసి ఈ వేడుకకు ఆహ్వానించారు. దానికి సంబంధించిన పత్రికను అందించారు. మరోవైపు దిగ్గజ సింగర్ ఆశా భోస్లేకి కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానం అందింది. ట్రస్ట్ నిర్వాహకులు ఆమెను కలిసి ఆశాను సాదరంగా ఆహ్వానించారు. ఇక ఆమెతో పాటు దివంగత గాయని లత మంగేష్కర్ సోదరి ఉష మంగేష్కర్‌కు ఆహ్వానం అందింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందించింది. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్‌లకు కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందింది. ఇక టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అందులో మెగా స్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగర్జున వంటి పలువురు స్టార్స్ ఉన్నారు.