వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంక ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వ (61)(De Silva hit wicket) విచిత్రమైనరీతిలో ఔటయ్యాడు. అతడు హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సోమవారం రెండో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో(SL vs WI test) అర్ధశతకంతో నిలకడగా కొనసాగుతున్న డిసిల్వ.. షానన్ గాబ్రియల్ వేసిన 95వ ఓవర్‌లో ఓ బంతిని బ్యాక్‌ఫుట్‌పై నిల్చొని డిఫెన్స్ చేయబోయాడు. ఈ క్రమంలోనే ఆ బంతి వేగం, గమనం మారి బౌన్స్ అయి వికెట్ల మీద పడేలా కనిపించింది. దీంతో వెంటనే స్పందించిన లంక బ్యాట్స్‌మన్ ఆ బంతి వికెట్ల మీద పడకుండా బ్యాట్‌తో పక్కకు తోసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తన బ్యాట్ వికెట్లకు తాకడంతో బెయిల్స్ ఎగిరిపడ్డాయి. ఇలా తొందరపాటులో డిసిల్వ తనని తానే ఔట్ చేసుకొని పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నె (147; 300 బంతుల్లో 15x4) శతకంతో మెరిశాడు. ఈ క్రమంలోనే డిసిల్వ 61 పరుగుల వద్ద హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం విండీస్ బ్యాట్స్‌మన్ తడబడటంతో రెండో రోజు ఆట ముగిసేసరికి 113/6 స్కోర్‌తో నిలిచింది. ప్రస్తుతం లంక 273 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.