త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త జెర్సీనీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం ఓ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో డెవిడ్ వార్నర్, అక్షర్ పటేల్‌తో పాటు పృథ్వీ షా కొత్త జెర్సీలను ధరించారు. కొత్త జెర్సీని చూసిన ఉత్సాహం.. కొత్త దిల్లీకి.. ఇదే కొత్త జెర్సీ.. అంటూ ఆ ముగ్గురిని ట్యాగ్ చేసింది.
మార్చి 31న మొదలవ్వనున్న ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మరోవైపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 1న జరగనున్న రెండో రోజు మ్యాచ్ కోసం దిల్లీ క్యాపిటల్స్ సిద్ధం కానుంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో దిల్లీ జట్టు పోటీ పడనుంది.
ఇక దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 4న దిల్లీ తమ మొదటి హోమ్ గేమ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడనుంది. గత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ మొత్తం 14 మ్యాచులాడి ఏడింట్లో గెలిచి.. ఏడింట్లో ఓడింది. 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్ స్పాట్‌ను కోల్పోయారు.