మహిళల క్రికెట్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఛార్లీ డీన్‌ను దీప్తి శర్మ మన్కడింగ్ విధానంలో రనౌట్ చేసిన విషయం వివాదస్పదమైంది. అయితే ఈ రనౌట్ కావడానికి ముందే చార్లీ డీన్‌కు తాను వార్నింగ్ ఇచ్చానని, అంపైర్లకు కూడా ఈ విషయమై సమాచారం అందించానని భారత క్రికెటర్ దీప్తి శర్మ స్పష్టం చేసింది. 40పరుగులు చేసిన ఛార్లీ డీన్ చివరి వికెట్‌గా ఔటవ్వడం వల్ల భారత్ 16పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఇదే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ తీసుకుంది.
"ఇది మా ప్రణాళికలో ఓ భాగం. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు ఛార్లీ డీన్ క్రీజ్‌ను వదిలేసి బయటకు వస్తోంది. బౌలర్ బంతిని విడుదల చేయకముందే దాదాపు రెండు అడుగులు వెళ్లిపోయింది. దీంతో ఆమెను హెచ్చరించాం. అంపైర్లకు కూడా పరిస్థితిని వివరించాం. అయినప్పటికీ మళ్లీ ఛార్లీ అలా ముందుకు వెళ్లడంతో మరో అవకాశం లేక రనౌట్ చేశా. ఇదంతా నియమ నిబంధనలతోనే చేశాం" అని దీప్తి శర్మ స్పష్టం చేసింది.