Deepak Chahar Injured: టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరం కాగా.. ఇప్పుడు ప్రపంచకప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్ చాహర్ సైతం గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్ సందర్భంగా అతడి చీలమండకు గాయమైనట్లు వెల్లడైంది. ఈ కారణంగానే అతను తొలి వన్డేలోనే ఆడలేదు. చివరి రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు.
గాయం కారణంగా చాన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న దీపక్.. ఇటీవలే టీమ్ఇండియాలోకి పునరాగమనం చేశాడు. ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా ఎంపికైనప్పటికీ అతణ్ని జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు పంపలేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడించాలనుకున్నారు. కానీ చీలమండ మెలిక పడడంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. మరి దీపక్ ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడో లేడో తెలియడం లేదు.
ప్రపంచకప్ నెట్ బౌలర్లుగా ముకేశ్, సకారియా
ప్రపంచకప్ సందర్భంగా టీమ్ఇండియా ప్రాక్టీస్ కోసమని ఇద్దరు నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్లో చెన్నై తరఫున సత్తా చాటిన ముకేశ్ చౌదరి, దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన చేతన్ సకారియా నెట్ బౌలర్లుగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. పెర్త్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వీళ్లిద్దరూ జట్టుకు సేవలందించనున్నారు. ఆ తర్వాత కూడా జట్టుతోనే కొనసాగుతారు.