Debut Cricketers of Teamindia 2021: ఈ ఏడాది టీమ్ఇండియా తరఫున వివిధ ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన పలువురు ఆటగాళ్లు తమ తొలి ఇన్నింగ్స్‌ల్లోనే సత్తాచాటారు. తొలి సారి క్రీజులో అడుగుపెట్టామన్న భయం లేకుండా బ్యాటర్లు.. మొదటిసారి బౌలింగ్ చేస్తున్నామనే బెరుకు లేకుండా బౌలర్లు అదరగొట్టారు. మొదటి అడుగులోనే అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వారెవరు? ఎలా ఆడారో ఓ సారి తెలుసుకుందాం..
అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ
Shreyas Iyer test century: శ్రేయస్ అయ్యర్‌కు తన తొలి టెస్టు ఆడటానికి దాదాపు నాలుగేళ్ల కన్నా ఎక్కువ సమయమే పట్టింది. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అతడిపై అభిమానులు, దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కరిపించారు. ప్రస్తుతం ఇతడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.
ఐదు వికెట్ల ప్రదర్శన
Axar pates test debut: అక్షర్ పటేల్.. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోయినప్పటికీ ఈ ఏడాది క్రికెట్ అభిమానులు గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు. ఎందుకంటే తన టెస్టు అరంగేట్ర మ్యాచ్‌లో అతడు చూపిన ప్రభావం అలాంటింది. జడేజా గైర్హాజరీతో భారత జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సహా మొత్తం ఏడు వికెట్లతో సత్తాచాటాడు. తన తొలి టెస్టు వికెట్‌గా ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన రూట్‌ను ఎదుర్కొన్న అతడు.. ఆ మ్యాచ్‌లో అశ్విన్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండు రోజుల్లోనే ముగిసిన డేనైట్ టెస్టులో అక్షర్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. గులాబీ బంతితో స్టంప్స్‌నే టార్గెట్ చేసుకుని బౌలింగ్ చేసిన అతను ఆ మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టి జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. చివరి టెస్టులోనూ 9 వికెట్లతో మెరిశాడు. తన బంతులను ఆడలేక ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొత్తం 3 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడంలో అక్షర్ ప్రధాన పాత్ర పోషించాడు.
జట్టుకు అండగా
Washington sundar test debut: ఈ ఏడాది మొత్తం దాదాపుగా గాయాలతో సతమతమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన తొలి టెస్టు మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాపై జరిగిన బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో 144 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఏడో వికెట్‌కు శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరి ప్రదర్శన కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ ఏడాది 66.25 సగటుతో 265 పరుగులు చేశాడు.
టీమ్ఇండియాకు ఆడే అవకాశం
Venkatesh Iyer teamindia debut: ఐపీఎల్ రెండో దశలో అదిరిపోయే ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు వెంకటేశ్ అయ్యర్. పది మ్యాచ్‌లు ఆడి 370 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టీమ్ఇండియాకు ఆడే అవకాశం లభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న అతడు.. ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. మూడు వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ మెప్పించాడు. ఐపీఎల్ 2022 కోసం అతడిని 8కోట్లు వెచ్చించి రిటెయిన్ చేసుకుంది కేకేఆర్.
ధనాధన్.. ఫటాఫట్
Ishankishan T20 debut: మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భాగంగా తొలి టీ20లోనే టీమ్ఇండియా ఓడిపోయింది. అయితే బలంగా పుంజుకుని ఆ సిరీస్‌ను 3-2తో భారత్ సొంతం చేసుకోవడంలో ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లది కీలక పాత్ర. వాళ్లే ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్. రెండో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరూ తమ ప్రతిభను చాటారు. ఆ మ్యాచ్‌లో 165 పరుగుల ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ అనూహ్యంగా చెలరేగాడు. 32 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో.. అది కూడా ఆర్చర్ లాంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ అలవోకగా భారీ షాట్లు ఆడిన అతడి బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది.