తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: లంచ్ సమయానికి టీమ్ఇండియా 211/7

కివీస్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్ఇండియా లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో ఇషాంత్​, జడేజా ఉన్నారు. కివీస్​ బౌలర్లలో జేమీసన్​ 3, వాగ్నర్ 2, బౌల్ట్​, సౌథీ తలో వికెట్ తీసుకున్నారు.

wtc final, ind vs nz
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్

By

Published : Jun 20, 2021, 5:38 PM IST

Updated : Jun 20, 2021, 6:30 PM IST

సౌథాంప్టన్​ వేదికగా కివీస్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్ఇండియా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతోంది. మూడో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ(6 బంతుల్లో 2 పరుగులు), రవీంద్ర జడేజా(46 బంతుల్లో 15 పరుగులు) క్రీజులో ఉన్నారు. కివీస్​ బౌలర్లలో జేమీసన్ 3, వాగ్నర్​ 2, బౌల్ట్, సౌథీ తలో వికెట్ తీసుకున్నారు.

146/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా.. కాసేపటికే కెప్టెన్​ కోహ్లీ వికెట్​ను కోల్పోయింది. అద్భుతమైన బంతితో జేమీసన్.. విరాట్​ను​ ఎల్బీగా పెవిలియన్​ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్​ పంత్​ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 22 బంతులాడి కేవలం 4 పరుగులే చేసిన పంత్​ అనవసరమైన షాట్​ ఆడి జేమీసన్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. మరో బ్యాట్స్​మన్​ అజింక్య రహానె.. సంయమనం ప్రదర్శించాడు. అర్ధ సెంచరీకి చేరువైన అతడిని వాగ్నర్​ బోల్తా కొట్టించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన అశ్విన్​(27 బంతుల్లో 22 పరుగులు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసి చివరికి స్లిప్స్​లో దొరికిపోయాడు.

రాణించిన కివీస్ బౌలర్లు..

ఆట ప్రారంభమైన రెండో రోజు టీమ్ఇండియా 64.4 ఓవర్ల పాటు ఆడి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఓపెనర్లతో పాటు పుజారా వికెట్​ను వెంటవెంటనే కోల్పోయిన భారత్​ను కెప్టెన్​ కోహ్లీ, వైస్​ కెప్టెన్ అజింక్య రహానె ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్​కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, మూడో రోజు తొలి సెషన్​లో కోహ్లీ సేన డీలాపడింది. జట్టు మంచి స్థితిలోకి వచ్చిందనుకున్న సమయంలోనే విరాట్ వికెట్​ను కోల్పోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్లను పారేసుకుంది టీమ్ఇండియా.

ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమ్ఇండియా ఎంతసేపు క్రీజులో నిలుస్తుందనేది చూడాలి. అయితే ఈ వికెట్లన్నీ కివీస్​ బౌలర్లకు సునాయాసంగా దక్కినవేమి కాదు. ఒక్క పంత్​ మాత్రమే నిర్లక్ష్యంగా షాట్​కు పోయి స్లిప్స్​లో చిక్కాడు. మిగతా భారత బ్యాట్స్​మెన్​ అందరినీ.. న్యూజిలాండ్ బౌలర్ల చాకచక్యంతో బుట్టలో వేసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరంగా కనపడుతున్న రహానేను ఔట్​ చేయడానికి పక్కా స్కెచ్​ వేశారు.

ఆట ఆలస్యం..

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు మొదటి నుంచి వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. ఈ కారణంగానే మూడో రోజు ఆట కూడా ఆలస్యమైంది. సౌథాంప్టన్​లో వర్షం కురిసింది. ఈ కారణంగా ఔట్​ఫీల్డ్​ తడిగా మారింది. దీంతో మ్యాచ్​ సమయానికి ప్రారంభం కాలేదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్​ ప్రారంభమైంది. ఇప్పటికే తొలి రోజు ఆట వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. ఇక రెండో రోజు ఆట కూడా వెలుతురులేమీ కారణంగా నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగిసింది.

ఇదీ చదవండి:Controversial Tweet: ట్వీట్ చేశారు.. చిక్కుల్లో పడ్డారు

Last Updated : Jun 20, 2021, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details