David warner ashes : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డును సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న వార్నర్(36) పరుగులు చేసి ఔటయ్యాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన అతడు.. ఓపెనర్‌గా 45.60 యావరేజ్‌తో 8,208 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. ఫలితంగా టెస్టుల్లో ఓపెనర్‌గా ఎక్కువ పరుగులు చేసిన టాప్-5లో లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ జాబితాలో సెహ్వాగ్ 99 మ్యాచ్‌ల్లో 50.04 యావరేజ్, 8,207 పరుగులతో ఐదో స్థానంలో ఉండేవాడు. ఇందులో 22 శతకాలు, 30 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆసీస్ ఓపెనర్ వార్నర్.. సెహ్వాగ్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత సాధించాడు.
Warner sehwag : టెస్టుల్లో ఓపెనర్‌గా ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 44.86 యావరేజ్‌తో 11,845 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ 50.29 సగటు, 9,607 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ 9,030 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ మాజీ ఆటగాడు మథ్యూ హేడెన్ 8,625 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
Ashes series 2023 : ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్నమొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆడుతున్నాయి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇప్పుడు ఐదో రోజు ఆట హోరాహోరీగా సాగుతోంది. ఈ చివరి రోజు ఆటలో ఆసీస్ గెలవాలంటే మరో 174 పరుగులు అవసరం. తొలి ఇన్నింగ్స్ శతకం బాది హీరోగా మారిన ఖవాజా (34)క్రీజులో పట్టుదలతో ఆడుతున్నాడు. అతడితో పాటు నైట్ వాచ్‌మెన్ బోలాండ్ (13*) క్రీజులో కొనసాగుతున్నాడు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.