Daryl Mitchell Record: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అరుదైన రికార్డు సృష్టించాడు. 73 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు. ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు సిరీస్‌లో 400పైచిలుకు పరుగులు చేసిన మొట్టమొదటి కివీస్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో హెడింగ్లేలో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు మొత్తం 3 టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 482 పరుగులతో ఉన్నాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. మరో ఇన్నింగ్స్ మిగిలున్నందున మిచెల్ 500 పరుగుల మైలురాయి దాటే అవకాశం కూడా ఉంది.
అంతకుముందు ఈ ఘనత బెర్ట్ సట్‌క్లిఫ్ పేరిట ఉంది. కానీ అతడు ఆడింది 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కాదు. అతడు మొత్తం 7 ఇన్నింగ్స్‌ల్లో 451 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న మిచెల్.. 3 సెంచరీలు, ఓ అర్ధశతకం చేశాడు. 190 అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయినప్పటికీ జట్టును గెలిపించలేకపోతున్నాడు. మిచెల్, బ్లండెల్ మినహా కివీస్ బ్యాటర్లలో ఎవరూ ఆకట్టుకోలేకపోతున్నారు. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్ దక్కించుకుంది.