Darren Bravo Retirement : వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ డారెన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని బ్రావో సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. 14 ఏళ్ల పాటు వెస్టిండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక 34 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన కెరీర్లో.. 122 వన్డే, 56 టెస్టు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి బ్రావో.. 7,052 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. బ్రావో చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అయితే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో.. వెస్టిండీస్ జట్టుకు ఎంపిక కాని తర్వాత బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
మాజీ క్రికెటర్ డ్వెన్ బ్రావో సోదరుడిగా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన డారెన్ బ్రావో.. విండీస్ తరఫున అనేక కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తక్కువ కాలంలోనే బ్రావో.. జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. మరోవైపు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో.. 98 మ్యాచ్‌ల్లో 1956 పరుగులు చేశాడు. ఇక 2017లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన బ్రావో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
Narine Retirement : ఇటీవల ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల నరైన్.. తన కెరీర్లో అంతర్జాతీయంగా 65 వన్డే, 51 టీ20, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నరైన్.. డొమెస్టిక్ లీగ్‌లలో యధావిథిగా ఆడనున్నట్లు స్పష్టం చేశాడు.