Danushka Gunathilaka Sri Lanka : శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక త్వరలో నేషనల్ క్రికెట్ టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అత్యాచార వేధింపుల కేసు కారణంగా అతనిపై విధించిన నిషేధాన్ని తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా క్రికెట్ శ్రీలంక తెలిపింది.
"ఆస్ట్రేలియాలో దనుష్క గుణతిలకపై వేసిన నేరారోపణలను దర్యాప్తు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్ర విచారణ కమిటీ.. నవంబర్ 2022లో గుణతిలకపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో దాఖలు చేసిన అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందిన అతను.. ఇప్పుడు నేషనల్ టీమ్‌లోకి తిరిగి రాగలడు." అంటూ క్రికెట్ బోర్డు పేర్కొంది. దీనిపై క్రికెట్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Danushka Gunathilaka Case : గతేడాది టీ20 ప్రపంచ కప్ సమయంలో ఆస్ట్రేలియా మహిళపై అతడు అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో ఆసీస్ పోలీసు అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఆ అత్యాచారయత్న ఆరోపణలను కొట్టి పారేస్తూ తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కేసు నుంచి గుణతిలక నిర్దోషిగా బయటపట్టాడు.