తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్-పాక్ పోరు కంటే ఏదీ గొప్పది కాదు' - భారత్ పాకిస్థాన్ మ్యాచ్ గిల్​క్రిస్ట్

IND vs PAK: టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్​ విడుదలైంది. మరోసారి తమ తొలిపోరులో దాయాది పాకిస్థాన్​తో తలపడబోతుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్​పై స్పందించారు పలువురు మాజీలు. ఎవరు ఏమన్నారంటే?

IND vs PAK
IND vs PAK

By

Published : Jan 21, 2022, 7:27 PM IST

IND vs PAK: ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద పోరు యాషెస్‌ సిరీస్ కాదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకెల్‌ వాన్‌ పేర్కొన్నాడు. భారత్- పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను అధికమంది చూస్తారని, ఇదే అసలైన సమరమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌-2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసేసింది. మరోసారి దాయాది జట్లు ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సుకత రేగింది. ఈ క్రమంలో దాయాది దేశాల పోరుపై మైకెల్‌ వాన్, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, డేల్‌ స్టెయిన్‌ స్పందించారు.

  • "ఇంగ్లాండ్‌, ఆసీస్ మాజీ ఆటగాళ్లుగా యాషెస్‌ సిరీస్‌నే బిగ్గెస్ట్‌ గేమ్‌గా భావిస్తాం. అయితే అది తప్పు. భారత్-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచే అతిపెద్ద పోరు. రోహిత్ శర్మ సారథిగా అసలైన సవాల్‌ను ఎదుర్కోనున్నాడు. రాబోయే వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రత్యేకంగా నిలవనుంది" అని తెలిపాడు వాన్.
  • "దాయాదుల మధ్య భారీ పోటీ ఉండటం ఖాయం. గత ప్రపంచకప్‌లో పది వికెట్ల తేడాతో భారత్‌పై పాక్‌ విజయం సాధించింది. కాబట్టే ఈసారి టీమ్‌ఇండియా చెలరేగుతుందని భావిస్తున్నా" అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు.
  • "దాయాది దేశాల మధ్య మ్యాచ్‌ అంటేనే క్రేజీగా ఉంటుంది. అందుకు మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదిక కావడం విశేషం. ఎంసీజీ అంటే నాకెంతో ఇష్టం. 2015 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాతో ఇక్కడే తలపడ్డాం" అని గుర్తు చేసుకున్నాడు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్.

గత పొట్టి ప్రపంచకప్‌లోనూ (2021) మొదటి మ్యాచ్‌లో పాక్‌తోనే టీమ్‌ఇండియా తలపడింది. కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడి సెమీస్‌ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్‌ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ జట్టు ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:

టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్​ రిలీజ్.. భారత్-పాక్ మ్యాచ్​ ఎప్పుడంటే?

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న రాహుల్-అతియా!

ABOUT THE AUTHOR

...view details