India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది టీమ్ఇండియా. దిల్లీ వేదికగా జూన్ 9న జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు (211) సాధించినా.. బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యాలతో ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఆదివారం (జూన్ 12) ఒడిశా కటక్‌లోని బారాబతి మైదానంలో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే గట్టిగా పునరాగమనం చేయాలని భావిస్తున్న టీమ్ఇండియా ప్రణాళికకు వరుణుడు గండి కొట్టే అవకాశం ఉంది.
మ్యాచ్ సందర్భంగా వర్షం పడే అవకాశం పెద్దగా లేకున్నా.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) శనివారం పేర్కొంది. "వర్షం పడే అవకాశం 50:50. ఆదివారం సాయంత్రం వర్షం పడదని కచ్చితంగా చెప్పలేం. ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు. అయితే అది 3-4 గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. కొన్ని చినుకులు పడినా భారీ వాన పడకపోవచ్చు. అదేమీ మ్యాచ్‌ను ప్రభావితం చేయదు" అని ఆర్ఎంసీ డైరెక్టర్ హెఆర్ బిశ్వాస్ తెలిపారు.