CSK Suresh Raina: సురేశ్ రైనా.. ఒకప్పుడు భారత జట్టులో నిలకడైన ఆటగాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో మేటి క్రీడాకారుడు. ఆటలో ఎంత నిబద్ధతతో ఉంటాడో కెరీర్‌ను కూడా అంతే కచ్చితత్వంతో నిర్మించుకున్నాడు. ఈ క్రమంలోనే అటు టీమ్‌ఇండియాలో, ఇటు చెన్నై సూపర్ కింగ్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సీఎస్కేలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తర్వాత అంతటి ఆటగాడిగా ఎదిగాడు. అలాంటి ఆటగాడిని చెన్నై ముందే వదులుకోవడం ఒకింత ఆశ్చర్యం అయితే, మెగా వేలంలోనూ ఎవరూ కొనుగోలు చేయకపోవడం మరింత విచారం. అయితే, అతడి కథ ఈ రెండేళ్లలోనే అడ్డం తిరిగింది. అది ఇప్పుడు కంచికి చేరినట్లు స్పష్టమవుతోంది.
రైనాదే తొలి 5000 మార్క్..
ఐపీఎల్ తొలి సీజన్ నుంచే సురేశ్ రైనా చెన్నై జట్టులో అంతర్భాగమయ్యాడు. ఎన్నిసార్లు వేలం పాటలు నిర్వహించినా, ఎన్నిసార్లు ఆటగాళ్ల రిటెన్షన్ పద్ధతులు కొనసాగినా సీఎస్కే ఎప్పుడూ అతడిని వదులుకోలేదు. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో చెన్నై అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదగడంలో అతడిదే కీలక పాత్ర. 2016, 2017 సీజన్లలో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు మినహాయిస్తే గడిచిన 14 ఏళ్లలో 11 సీజన్లు చెన్నైతోనే కొనసాగాడు. 2018లో తిరిగి ధోనీ చెంత చేరిన అతడు జట్టు మూడోసారి ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2019లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఈ టీ20 లీగ్‌లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5,528 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచాడు. అందులో ఒక శతకం, 39 అర్ధ శతకాలు ఉండటం విశేషం.
గత రెండేళ్లుగా అనిశ్చితి..
ఇంత గొప్ప రికార్డులున్న రైనా జీవితం గత రెండేళ్లలోనే పూర్తిగా మారిపోయింది. తొలుత 2020లో కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో నిర్వహించగా.. ఆ సమయంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న ధోనీ టీమ్‌ఇండియాకు గుడ్‌బై చెప్పిన మరుసటి క్షణమే రైనా సైతం అదే పని చేశాడు. యూఏఈకి వెళ్లేముందు చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం నుంచే ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఇక అదే నెలలో చెన్నై జట్టుతోనే యూఏఈకి వెళ్లిన రైనా కొద్ది రోజుల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చేశాడు.
ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతోనే తిరిగి భారత్‌కు వచ్చేసినట్లు పేర్కొన్నాడు. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఆ సమయంలో పంజాబ్‌లో ఉంటున్న రైనా దగ్గరి బంధువులపై దుండగులు దాడి చేశారు. ఆ చేదు ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో భయాందోళనకు గురైన తన కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండేందుకే రైనా 2020 సీజన్‌ను ఆడలేదు.
యాజమాన్యంతో విభేదాలు?
అయితే, రైనా భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు చెన్నై జట్టు యాజమాన్యంతో పడట్లేదనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. యూఏఈలో చెన్నై టీమ్ ప్రత్యేకంగా బసచేసిన హోటల్‌లో కెప్టెన్ ధోనీకి కేటాయించిన గది (బాల్కనీ వ్యూ ఉన్నది) లాంటిదే తనకూ కావాలని రైనా పట్టుబట్టినట్లు, దానికి యాజమాన్యం అంగీకరించనట్లు పుకార్లు షికార్లు చేశాయి. అందువల్లే రైనా ఆగ్రహించి భారత్‌కు తిరిగి వచ్చాడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో సీఎస్కే యజమాని ఎన్.శ్రీనివాసన్ సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వల్ల నిజంగానే రైనాకు ఆ జట్టుతో పడటం లేదనే అభిప్రాయం కలిగింది.