తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: జడేజా.. ధోనీ నమ్మకాన్ని నిలబెడతాడా.?

CSK Dhoni Jadeja: మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయంతో క్రికెట్ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు పగ్గాలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే, ఇంతకు మునుపెన్నడూ నాయకత్వ బాధ్యతలు చేపట్టని జడేజా.. ధోనీ నమ్మకాన్ని నిలబెడతాడా లేదో చూడాలి!

IPL 2022
JADEJA

By

Published : Mar 24, 2022, 10:25 PM IST

CSK Dhoni Jadeja: క్రికెట్లో ఎప్పుడు ఏం చేయాలో ధోనీకి బాగా తెలుసు. వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. తన వ్యూహాలతో మైదానంలో ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించే ధోనీ.. తన కెరీర్‌ విషయంలోనూ ఎవరి ఊహకు అందని రీతిలో అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు. 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే విరాట్ కోహ్లీకి టెస్టు బాధ్యతలు అప్పగించినప్పుడు అభిమానులు ఎంత ఆశ్చర్యపోయారో.. 2017 జనవరిలో వన్డే పగ్గాలను వదిలేసినప్పుడు కూడా అంతే షాక్‌కి గురయ్యారు. 2008-2016 వరకు టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాడు. తాజాగా, ఐపీఎల్‌లోనూ అదే రీతిలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు.

జడేజా

ధోనీ నమ్మకం గెలుచుకుని..ఎంతో నమ్మకం ఉంటే గానీ ధోనీ.. రవీంద్ర జడేజాకు సీఎస్కే సారథ్య బాధ్యతలు అప్పగించనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జడేజా ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడు. భారత జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇటు బంతి, అటు బ్యాటు రెండింటితోనూ గొప్పగా రాణిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా 175* రికార్డు స్కోరు నమోదు చేశాడు. అదే మ్యాచులో 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఏ స్థానంలో బరిలోకి దించినా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు, గత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున జడేజా ఇదే స్థాయిలో రాణించాడు. 227 పరుగులతో పాటు.. 13 వికెట్లు పడగొట్టాడు. జడేజాలోని టాలెంట్‌ని గుర్తించాడు కాబట్టే అతడిని తన తర్వాతి కెప్టెన్‌గా ధోనీ ఎంపిక చేశాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధోనీ

అనుభవం లేకపోయినప్పటికీ..2008 అండర్ - 19 ప్రపంచకప్‌ పోటీల్లో యువ భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా.. రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. జడేజాకు ఇదొక్కటి మినహాయిస్తే ఇంతకు మునుపెన్నడూ జట్టుని ముందుండి నడపించిన అనుభవం లేదు. అయితే, ధోనీ పగ్గాలు వదిలేసినా.. జడేజా వెనకుండి జట్టుని నడిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు కూడా కోహ్లీకి వన్డే కెప్టెన్సీ అప్పగించినా.. తను క్రికెట్లో కొనసాగినంత కాలం జట్టుకి పెద్ద దిక్కుగా క్లిష్ట పరిస్థితుల్లో తన క్రికెటింగ్ బుర్రతో గొప్ప విజయాలను అందించాడు. ప్రస్తుతం జడేజాకు కూడా అదే రీతిలో ధోనీ సహకారం అందిస్తాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జడేజాకు కలిసొచ్చే అంశం అదే..ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో టీమ్‌ఇండియా ఆల్ రౌండర్లు హార్దిక్‌ పాండ్య గుజరాత్ టైటాన్స్ జట్టుకు, రవీంద్ర జడేజా చెన్నై జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. గతంలో వీరిద్దరూ ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియాకు ఆడారు. అయితే, వెన్నెముక గాయం కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయిన హార్దిక్‌ మునుపటి స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ చేయడంలో విఫలమవుతున్నాడు. మరోవైపు, జడేజా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ విషయంలో ఇద్దరికీ పెద్దగా అనుభవం లేదు. అయితే, జడేజా వెనుక ధోనీ ఉన్నాడు. కెప్టెన్‌గా ధోనీకున్న అనుభవం జడేజాకు కలిసొస్తుంది. అంతే కాకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జడేజా ఆపద్బాంధవుడి పాత్ర పోషించడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. మరోవైపు, హార్దిక్‌ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇది గుజరాత్ జట్టుకు ప్రతికూలంగా మారొచ్చు.!

ఏం చేసినా జట్టు కోసమే..ధోనీ ఏం చేసినా సీఎస్కే ఫ్రాంఛైజీ అత్యుత్తమ ప్రయోజనాల కోసమే. చెన్నై జట్టు భవిష్యత్తు కోసమే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయంతో మేమంతా చాలా సంతోషిస్తున్నాం. రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించినా.. ధోనీ జట్టుతోనే కొనసాగుతాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌. చాలా ఏళ్లుగా జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న అతడికి.. జట్టు అవసరాలేంటో బాగా తెలుసు. ధోనీ సహకారంతో అతడు మెరుగ్గా రాణించగలడనే నమ్మకం ఉంది’ అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డాడు.

ధోనీ స్థానంలో బాధ్యతలు చేపట్టినా.. ఆ స్థాయి ప్రభావం చూపడం జడేజాకు ఏమంత సులభం కాదు. భారీ అంచనాల మధ్య చెన్నై జట్టు పగ్గాలు చేపట్టిన జడేజా.. ధోనీ నమ్మకాన్ని నిలబెడతాడా.? చెన్నై జట్టుని మరో స్థాయికి తీసుకెళ్తాడా.? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌లో జడేజా నాయకుడిగా ఏ మేరకు విజయవంతమవుతాడో చూడాలి!

ఇదీ చదవండి:IPL 2022: కెప్టెన్​గా ఎంపికవ్వడంపై జడ్డూ ఏమన్నాడంటే?

ABOUT THE AUTHOR

...view details