ఏ క్రికెట్ మ్యాచ్‌లోనైనా ఆటగాడు శతకం చేస్తే.. అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతాడు. దాంతో పాటు అతడి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే, తాను అత్యుత్తమ ప్రదర్శన చేసి సెంచరీ సాధించాలని ప్రతి బ్యాటర్ అనుకుంటాడు. అలాగే తమ అభిమాన ప్లేయర్ సెంచరీ కొట్టాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. కానీ ఆ శతక లక్ష్యాన్ని ఛేదించడం.. అంత సులువేమి కాదు. నిరంతర సాధన చేస్తే తప్ప అలాంటి ఘనతలను సాధించలేము. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో సెంచరీలు చేసిన పలు ఆటగాళ్లు చాలా కాలంగా శతకాలకు దూరంగా ఉన్నారు. అయితే సుదీర్ఘమైన విరామం తర్వాత ఈ ఏడాదిలో కొందరు తమ శతకాల సంఖ్యను పెంచుకున్నారు. వారెవరో తెలుసుకుందాం.
లాంగ్ గ్యాప్ తర్వాత సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే!
విరాట్ కోహ్లీ :
2019 నవంబర్ 22 బంగ్లాదేశ్‌పై విరాట్ తన 70వ సెంచరీని సాధించిన రోజు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శతకాలపై దృష్టి సారించలేకపోయాడు. అనంతరం కొవిడ్ విజృంభన తగ్గిన తర్వాత క్రికెట్ తిరిగి ప్రారంభమైంది. ఆట మొదలుపెట్టిన విరాట్ గతంలోలాగా బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. సెంచరీలకు ఆమడ దూరంలో ఉండిపోయాడు. దీంతో విరాట్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
2022లో జరిగిన మ్యాచ్‌లలో సగానికి పైగా మ్యాచ్‌ల్లో ఆడాడు విరాట్. సెంచరీలు చేయలేకపోవడం తప్ప.. 50 లోపు పరుగుల చేసిన విరాట్ ప్రదర్శన బాగానే ఉంది. కాగా, దాదాపు 1021 రోజుల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తన 71వ సెంచరీని చేశాడు. ఆసియా కప్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి అఫ్ఘానిస్థాన్‌పై 61 బంతుల్లో 122 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఆ తర్వాత నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో 91 బంతుల్లో 113 పరుగులు తీశాడు. ఈ ఏడాది అతనికిది రెండో శతకం. అలాగే వన్డేల్లో 44వది, అంతర్జాతీయ క్రికెట్‌లో 72వ సెంచరీ.
స్టీవ్ స్మిత్ :
దిగ్గజ టెస్ట్ క్రికెటర్లలో ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకరు. విరాట్ కొహ్లీ, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, న్యూజీలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్తో కలిసి స్మిత్ ఫ్యాబ్ ఫోర్ అనే పేరును తెచ్చుకున్నాడు. కానీ ఈ బ్యాటర్ కూడా కొంతకాలం సెంచరీ కోసం కష్టపడ్డాడు.