విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు త్రిష, షబ్నమ్ ఉన్నారు. భద్రాచలం అమ్మాయి త్రిష బ్యాటింగ్‌లో సత్తాచాటగా.. విశాఖపట్నం పేసర్ షబ్నమ్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా 17 ఏళ్ల త్రిష తన ప్రదర్శనతో మెప్పించింది. 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసింది. అందులో స్కాట్లాండ్‌పై ఓ అర్ధశతకమూ చేసింది. అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తాచాటింది. కీలకమైన ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా ఆడింది. పిచ్‌ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా ఆడి జట్టును విజయం వైపు నడిపించింది. మొట్టమొదటి అండర్-19 ప్రపంచకప్ గెలవడం సంతోషంగా ఉందని ఆమె ‘ఈనాడు’తో చెప్పింది. ‘‘ప్రపంచకప్ గెలిచిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. గాల్లో తేలిపోతున్నట్లు ఉంది. టోర్నీలో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపించారు. ఆ పిచ్ కాస్త భిన్నంగా స్పందించింది. స్పిన్నర్స్‌కు అనుకూలించింది. అందుకే జాగ్రత్తగా ఆడా. ఇప్పటికే సీనియర్ స్థాయిలో ఆడిన షెఫాలి, రిచా ఘోష్‌లతో కలిసి ఆడడం మంచి అనుభవం. ఫైనల్లో ఒత్తిడికి గురి కాలేదు. జట్టును విజయతీరాలకు చేర్చగలమని నమ్మకంతో ఉన్నా. సౌమ్యకు కూడా అదే చెప్పా. ఔట్ కాకుండా చివరి వరకూ ఉండాల్సింది. ఈ కప్పు గెలవడమే ఇప్పటివరకూ నా జీవితంలో అత్యుత్తమ క్షణం’’ అని త్రిష చెప్పింది. మరోవైపు షబ్నమ్ రెండు మ్యాచ్‌ల్లో ఆడింది. అయితే అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఆమె పేస్‌తో ఆకట్టుకుంది. "ప్రపంచకప్ నెగ్గడం గొప్పగా అనిపిస్తోంది. దీని కోసమే ఎంతో కష్టపడ్డాం. ఈ టోర్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఎన్నో అనుభవాలు సొంతం చేసుకున్నా. బౌలింగ్‌లో మరింత మెరుగయేందుకు శ్రమిస్తా. కప్పు అందుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అని 15 ఏళ్ల షబ్నమ్ పేర్కొంది.
ఒకరు బ్యాటింగ్.. మరొకరు బౌలింగ్.. ప్రపంచకప్‌లో అదరగొట్టిన తెలుగు అమ్మాయిలు - under19 world cup 2023
అమ్మాయిల ప్రపంచకప్‌లో గెలవడంలో కీలక పాత్ర పోషించారు తెలుగు యువతులు. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు త్రిష, షబ్నమ్ ఉన్నారు. తెలుగు గడ్డ గర్వించేలా ఆడి వారి ఆట తీరుతో అందరిని ఆశ్చర్యపరిచారు. త్రిష బ్యాటింగ్‌లో సత్తాచాటగా.. విశాఖపట్నం పేసర్ షబ్నమ్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది.
కథానాయికలు వీళ్లే: అన్ని విభాగాల్లో బలంగా కనిపించిన యువ భారత్.. టైటిల్ ఫేవరెట్‌గానే టోర్నీలో అడుగుపెట్టింది. అంచనాలను అందుకుంటూ సాగింది. గ్రూప్‌లో అజేయంగా నిలిచిన జట్టు.. సూపర్-6 దశలో ఆసీస్ చేతిలో ఓటమి మినహా మెరుగ్గానే రాణించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుచేసి.. తుదిపోరులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయం అమ్మాయిల క్రికెట్లో భారత భవిష్యత్ ఆశాజనకంగా ఉందని చాటుతోంది. బ్యాటింగ్‌లో శ్వేత సహ్రావత్, షెఫాలి వర్మ, గొంగడి త్రిష.. బౌలింగ్‌లో స్పిన్నర్లు పర్శవి, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పేసర్ తితాస్ నిలకడగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన ఓపెనర్ శ్వేత (7 మ్యాచ్‌ల్లో 99 సగటుతో 297) సూపర్ ఫామ్ జట్టుకు మేలు చేసింది. షెఫాలి (172)తో కలిసి ఆమె జట్టుకు మంచి ఆరంభాలు అందించింది. బౌలింగ్‌లో లెగ్‌స్పిన్‌తో పర్శవి ప్రత్యర్థి పనిపట్టింది. 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో జట్టు కప్పు గెలవడంలో ప్రధాన భూమిక పోషించింది. ఆఫ్ స్పిన్నర్లు మన్నత్ (9), అర్చన (8) కూడా అదరగొట్టారు. పేస్ సంచలనం తితాస్ (6) భవిష్యత్ స్టార్‌గా ఎదిగేలా కనిపిస్తోంది. పేస్‌తో ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో రాటుదేలింది. ఇక ఇప్పటికే సీనియర్ జట్టులో ముద్ర వేసిన షెఫాలి, రిచా ఘోష్ అనుభవం కూడా టోర్నీలో భారత్‌కు ఉపయోగపడింది.