Yuvaraj Singh Son: భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. ఫాదర్స్ డే స్పెషల్‌గా తన కొడుకును అభిమానులకు పరిచయం చేశాడు. యువీ భార్య హేజల్ కీచ్.. జనవరి 26న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆరు నెలలకు కొడుకుకి ఓరియన్ కీచ్ సింగ్ అని నామకరణం చేశారు యువీ, కీచ్ జంట. "వెల్ కమ్ టు ది వరల్డ్.. ఓరియన్ కీచ్ సింగ్. మమ్మీ, డాడీ.. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నువ్వు ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి" అంటూ సోషల్‌మీడియాలో రాసుకొచ్చిన యువరాజ్.. కొడుకు ఫోటోలను షేర్ చేశాడు.
17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 402 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్.. 11,778 పరుగులు చేశాడు. యువీ కెరీర్‌లో 17 సెంచరీలు, 71 అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన యువరాజ్.. తన కెరీర్‌లో 148 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్‌లో ఏడు సార్లు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' టైటిల్స్ గెలిచాడు. భారత జట్టు 2011 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. ఆ టోర్నీలో 350కి పైగా పరుగులు, 15 వికెట్లు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. కెరీర్ చరమాంకంలో అంతర్జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్.. ఆ తర్వాత జట్టులో స్థానం కోసం రెండేళ్లకు పైగా ఎదురుచూసి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్ 2022 సీజన్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన యువీ.. యూట్యూబ్ వీడియోలతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.