Umesh Yadav News: భారత క్రికెట్ జట్టు పేసర్ ఉమేశ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడే కదా అని పిలిచి ఉద్యోగం ఇస్తే.. అతడి చేతిలోనే మోసపోయాడు. భూమి ఇప్పిస్తానంటూ ఆ వ్యక్తి రూ.44లక్షలు క్రికెటర్ నుంచి కాజేశాడు. దీంతో ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫ్రెండ్ చేతిలో మోసపోయిన క్రికెటర్ ఉమేశ్ యాదవ్.. రూ.44 లక్షలు స్వాహా..
టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్.. తన స్నేహితుడి చేతిలోనే మోసపోయాడు. భూమి ఇప్పిస్తానంటూ ఆ వ్యక్తి రూ.44 లక్షలు క్రికెటర్ నుంచి కాజేశాడు. దీంతో ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. 2014లో టీమ్ఇండియాలో ప్లేయర్‌గా సెలెక్టయిన ఉమేశ్.. స్నేహితుడైన శైలేశ్ ఠాక్రేను తన పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆప్తుడైనందున అతడు నమ్మకంగా ఉంటాడని భావించాడు. అలా ఉమేష్ యాదవ్‌కు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలను శైలేశ్ నిర్వహించడం ప్రారంభించాడు. యాదవ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ లాంటి ఇతర ఆర్థిక పనులను అతడే స్వయంగా చుసుకునేవాడు. అలా నాగ్‌పుర్‌లో ఓ భూమిని కొనుగోలు చేయడానికి ఠాక్రే సహాయం కోరాడు ఉమేశ్.
ఈ మాటకు సరేనన్న ఠాక్రే ఓ ల్యాండ్‌ను కనుగొని దాన్ని యాదవ్ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికాడు. దీంతో ఉమేశ్ రూ. 44 లక్షలను ఠాక్రే అకౌంట్లో డిపాజిట్ చేశాడు. తీరా చూస్తే ఆ ప్లాట్‌ను ఠాక్రే తన పేరు మీద కొనుగోలు చేశాడు. ఈ మోసం గురించి తెలుసుకున్న యాదవ్, ప్లాట్‌ను తన పేరు మీద బదిలీ చేయమని ఠాక్రేని అడగ్గా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఉమేశ్ అతడి సొమ్ము తిరిగివ్వమనగా దానికి కూడా నో చెప్పాడు. స్నేహితుడు చేసిన మోసానికి ఆవేదన చెందిన ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. ఉమేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.