టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతి త్వరలోనే అతడు వెండితెరపై మెరవనున్నాడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో ధావన్ అతిథి పాత్రలో నటించాడు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తు్న్నాడు. ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేసింది.
తన సినిమా అరంగేట్రం గురించి ధావన్ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ‘‘దేశం తరఫున ఆడే నా లాంటి అథ్లెట్ జీవితం క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు ముందు కథ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది. మనం ఎలా ఉన్నా.. మన కలలను నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుంది’’ అని ధావన్ వివరించాడు.