Cricketer Sarfaraz Khan Marriage : ముంబయికి చెందిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక.. వధువు స్వస్థలం షోపియాన్‌లో ఘనంగా జరిగింది. సర్ఫరాజ్ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివాహానికి సంబంధించిన ఫొటోలను సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా, క్రిస్ గేల్, ఆకాశ్ దీప్, అభిషేక్ పోరెల్, మన్‌దీప్ సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
టీమ్‌ఇండియాలో ఎంట్రీ అప్పుడే!
Sarfaraz Khan Team India : అయితే వివాహ వేడుక సందర్భంగా జుమ్ముకశ్మీర్ లోకల్ మీడియా.. టీమ్‌ఇండియాలోకి సర్ఫరాజ్ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించారు. "దేవుడు నిర్ణయిస్తే ఏదో ఒకరోజు కచ్చితంగా భారత్ తరఫున ఆడుతాను" అని సమాధానం ఇచ్చాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడం విధి నిర్ణయమని చెప్పాడు.
అదరగొడుతున్నా కానీ..
Sarfaraz Khan Career : ముంబయికి చెందిన 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ టీమ్‌ఇండియాలో ఎంట్రీ కోసం కొన్నాళ్లగా వేచిచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ టీమ్‌ఇండియాలోకి అతడికి పిలుపు రావడం లేదు. ఇదే విషయమై గత కొన్నిరోజులు సర్ఫరాజ్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నాడు. పరోక్షంగా సెలక్టర్లపై విమర్శలు సైతం చేశాడు.