తెలంగాణ

telangana

ETV Bharat / sports

పదో వన్డేలోనే అద్భుత ఘనత.. ఇలాగే చెలరేగితే ఎదురు ఉండదిక! - ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ

టీమ్​ఇండియా ప్లేయర్​ ఇషాన్​ కిషన్​ వన్డేలో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన పదో వన్డేలోనే డబుల్ సెంచరీతో చెలరేగి క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాతైనా ఇషాన్‌ నిలకడ అందుకుని తన ప్రతిభకు న్యాయం చేస్తాడేమో చూడాలి

ishan kishan
ishan kishan

By

Published : Dec 11, 2022, 10:12 AM IST

Ishan Kishan : బంగ్లాదేశ్‌తో చివరి వన్డేకు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో అందివచ్చిన అవకాశాన్ని ఇషాన్‌ కిషన్‌ ఊహించని రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు. వన్డేల్లో వేగవంతమైన డబుల్‌ సెంచరీతో క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (24 ఏళ్ల 145 రోజులు) కూడా ఇషానే కావడం విశేషం.

ఇప్పటిదాకా వన్డే క్రికెట్లో తొమ్మిది డబుల్‌ సెంచరీలు నమోదయ్యాయి. కానీ ఆ ఘనత అందుకున్న ప్రతి ఆటగాడూ అప్పటికే కనీసం వంద వన్డేలాడాడు. అలాంటిది ఇషాన్‌ కేవలం తన పదో వన్డేలో ఈ అద్భుత ఘనతను అందుకున్నాడు. ఇషాన్‌ ప్రత్యేకత ఇక్కడే అర్థమైపోతుంది. ఒకప్పుడు అసాధ్యంలా అనిపించిన డబుల్‌ సెంచరీ.. 2010-17 మధ్య తొమ్మిది సందర్భాల్లో సాధ్యమైనప్పటికీ, అదంతా తేలికైన ఘనత అయితే కాదు. 2017లో రోహిత్‌ సాధించాక గత అయిదేళ్లలో ఇంకెవ్వరూ ఆ మార్కును అందుకోలేకపోయారు.

అలాంటిది రోహిత్‌ గాయపడడంతో అనుకోకుండా అవకాశం వస్తే.. ఇంత ఆత్మవిశ్వాసంతో ఆడి ద్విశతం సాధించడం చిన్న విషయం కాదు. అందులోనూ ఘోరమైన బ్యాటింగ్‌ వైఫల్యంతో బంగ్లా చేతిలో వరుసగా రెండు పరాభవాలు చవిచూసి మొత్తం జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న స్థితిలో తాత్కాలికంగా అవకాశం అందుకుని ఇలాంటి సంచలన ఇన్నింగ్స్‌ ఆడడం అనూహ్యం.

మ్యాచ్‌ నేపథ్యం, పరిస్థితులు, ప్రత్యర్థి ఫామ్‌.. ఇవేవీ పట్టించుకోకుండా, బెదురన్నదే లేకుండా, అవకాశం దొరికినపుడు చెలరేగిపోయే ఈ తరం కుర్రాళ్లకు ప్రతినిధిలా కనిపించాడు ఇషాన్‌. ఇప్పటికే టీ20ల్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా.. నిలకడ లేక జట్టులో చోటు కోల్పోయాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాతైనా ఇషాన్‌ నిలకడ అందుకుని తన ప్రతిభకు అతను న్యాయం చేస్తాడేమో, జట్టులో పాతుకుపోతాడేమో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details