పసికూన జింబాబ్వే క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)గురువారంనిషేధం విధించింది. ఆ దేశ క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం మితిమీరడం వల్ల ఈ సంచలన నిర్ణయం తీసుకుంది ఐసీసీ. తక్షణమే ఈ వేటు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై ఆ దేశ క్రికెటర్ రజా తొలుత ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా ఆట నుంచి తప్పుకోవాలని ఏ క్రీడాకారుడు కోరుకోడని మనసులోని బాధ బయటపెట్టాడు.
" ఒక్క నిర్ణయం జట్టును విడదీసింది. ఎంతో మందిని నిరుద్యోగులుగా మార్చింది. ఎన్నో కుటుంబాల్లో బాధను నింపింది. ఎందరో క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసింది. ఈ విధంగా అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలకాల్సి వస్తుందని అనుకోలేదు ".
-- సికిందర్ రజా, జింబాబ్వే క్రికెటర్.
అనంతరం జింబాబ్వేమాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, ఫాస్ట్ బౌలర్ కేల్ జార్విస్, ఆల్‌రౌండర్ సొలోమన్ మెయిర్ వంటి క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, మైదాన సిబ్బంది, యువ క్రికెటర్లు ఆటను వదిలి మరేదైనా పని చూసుకోవాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నిరుపయోగమైన క్రికెట్ కిట్లను తగులబెట్టడం తప్ప ఏం చేసే స్థితిలో లేరని వారి గోడు చెప్పుకున్నారు. ఐసీసీ షాకింగ్ నిర్ణయం తర్వాత సొలోమన్ అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 29 ఏళ్ల ఈ ఆటగాడు 47 వన్డేలు మాత్రమే ఆడి ఆట నుంచి తప్పుకున్నాడు.
2020 జనవరిలో భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది జింబాబ్వే. మూడు టీ20లు ఆడేందుకు ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. 2002 ఫిబ్రవరిలో చివరిగా టీమిండియాతో తలపడింది పసికూన.