మే 31న ప్రారంభంకాబోయే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్లు సత్తాచాటాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ఈసారి మెగాటోర్నీలో మంచి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లలో కొందరు సీరియస్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి జట్టులో విలువైన ఆటగాడి సత్తా ఏంటో చూద్దాం.
జాసన్ రాయ్ (ఇంగ్లాండ్)
ఆతిథ్య దేశంగా ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఇంగ్లాండ్‌కు ఈసారి ట్రోఫీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందరో స్టార్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగుతోందీ జట్టు. అందులో ఓపెనర్ జాసన్ రేయ్ కీలకం కానున్నాడు. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించే ఈ ఆటగాడు తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగలడు. ఇప్పటివరకు 75 వన్డేల్లో 40.81 సగటుతో 2,938 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్ నాలుగో వన్డేలో అద్భుత శతకంతో జట్టును గెలిపించాడు. కూతురు ఆరోగ్యం కోసం నిద్రలేని రాత్రి గడిపి మరుసటి రోజే సెంచరీ బాది ఆటపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు.
విరాట్ కోహ్లీ (భారత్)
తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుని టీమిండియాకు సారథిగా ఎదిగాడు కోహ్లీ. జట్టు ఏదైనా.. పిచ్ ఎలా ఉన్నా... పరుగులు సాధించగల సమర్థుడు. జట్టు గెలుపులో ఈ ఆటగాడు కీలకం కానున్నాడు. వన్డే, టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 227 వన్డేల్లో 59.57 సగటుతో 10,843 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు ఉండటం గమనార్హం. సారథిగా ఈసారి భారత్‌కు ప్రపంచకప్ ట్రోఫీ తెచ్చేందుకు శ్రమిస్తున్నాడు.
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
వేగం, కచ్చితత్వంతో బౌలింగ్ చేయగల నైపుణ్యమున్న బౌలర్ బౌల్ట్. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్ ప్రపంచకప్‌లో సత్తాచాటడానికి ఊవ్విళ్లూరుతున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కివీస్ జట్టులో విలువైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 79 వన్డేల్లో 147 వికెట్లు తీశాడు.
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
ఈ ప్రపంచకప్ తనకు చివరిదని ఇప్పటికే గేల్ ప్రకటించాడు. ఈ టోర్నీలో సత్తాచాటి జట్టుకు ట్రోఫీని అందించి కెరియర్ను ఘనంగా ముగించాలని ఆరాటపడుతున్నాడు. ఈ 39 ఏళ్ల విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు కష్టమే. జట్టులో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న గేల్ ఈ వరల్డ్‌కప్‌లో మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు 288 వన్డేలాడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ 38.02 సగటుతో 10,151 పరుగులు చేశాడు.