కోట్లాదిమంది భారతీయుల ఉరకలెత్తే ఉత్సాహాం తమకు మద్దతుగా ఉందన్న భరోసాతో... గెలవాలనే కసిని.. గుండెల నిండా కప్పు స్ఫూర్తిని నింపుకొని దూసుకొస్తోంది టీమిండియా. ప్రపంచకప్ గేరు మార్చేందుకు, అభిమానుల్లో జోష్ నింపేందుకు అన్ని అస్త్రశస్త్రాలతో ప్రత్యర్థులపై దాడికి సిద్ధమైపోయింది కోహ్లీసేన. మరికాసేపట్లో ప్రోటీస్‌తో పోరుకు సిద్ధమైంది.
ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా బెంబేలెత్తించే పేసర్లు.. మ్యాచ్ గమనాన్నే మార్చగల స్పిన్నర్లు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్‌తో మూడోసారి కప్పును ముద్దాడేందుకు అన్ని వనరులూ ఉన్నాయి భారత్‌కు. కొన్ని సవాళ్లున్నా భారీ అంచనాలతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. రెండు పరాభవాలతో డీలాపడ్డ దక్షిణాఫ్రికాతో సమరంలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరి అసలు పోరులో భారత్ ఎలా ఆడబోతోంది? చూడాలి మరి..
భారత్ వేట షురూ- నేడు దక్షిణాఫ్రికాతో ఢీ భారీ ఆశలు..
భారీ అంచనాలు.. అంతకు మించిన ఆకాంక్షల మధ్య ప్రపంచకప్‌లో తొలి పరీక్షకు సిద్ధమైంది భారత జట్టు. తన ఆరంభ పోరులో బుధవారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐపీఎల్ తర్వాత 20 రోజులు విశ్రాంతి తీసుకున్న జట్టు ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. సన్నాహక మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా లోతైన బ్యాటింగ్.. పదునైన బౌలింగ్‌పై తిరుగులేని నమ్మకంతో ఉంది. రోహిత్‌శర్మ సామర్థ్యం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా.. ధోని చాణక్యం టీమ్‌ఇండియాకు బలమైన పునాదులు.
మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాది చావోరేవో పరిస్థితి. మూడో మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిల్లడం ఖాయం! కొంత బలహీనపడ్డట్లు కనిపిస్తున్నా ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్‌లో రెండు జట్లూ బలంగా ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
పేసర్లా...స్పిన్నర్లా..?
ఓపెనింగ్‌లో రోహిత్, ధావన్.. వన్‌డౌన్‌లో విరాట్.. నాలుగో నంబరులో రాహుల్.. వికెట్ కీపర్‌గా ధోని.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య స్థానాలకు ఢోకా లేదు. పేసర్లు ముగ్గురా? ఇద్దరా? అన్న దానిపైనే తుదిజట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగితే బుమ్రా, షమి, భువనేశ్వర్ తుదిజట్టులో ఉంటారు. అప్పుడు హార్దిక్‌తో కలిపి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో టీమ్‌ఇండియా బరిలో దిగుతుంది. స్పిన్ కోటాలో కుల్‌దీప్‌యాదవ్ లేదా చాహల్‌లలో ఒకరికి అవకాశం లభించనుండగా మిగిలిన ఒక స్థానం కోసం జడేజా, కేదార్ జాదవ్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. తుదిజట్టులో జడేజాకు చోటు దక్కే అవకాశాలే అధికం. ఒకవేళ ఇద్దరు ప్రధాన పేసర్లతో ఆడితే భువనేశ్వర్ స్థానంలో జాదవ్‌కు అవకాశం లభిస్తుంది.
పిచ్ పరిస్థితేంటి..?
మంగళవారం మధ్యాహ్నం వరకు వికెట్ పచ్చికతో కళకళలాడింది. ఆ తర్వాత పచ్చికను పూర్తిగా తొలగించారు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టొచ్చు. వర్షం పడినా.. వాతావరణం చల్లగా ఉన్నా పేసర్లు ప్రభావం చూపొచ్చు. బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడే అవకాశముంది.
నువ్వా-నేనా..?
- ప్రపంచ కప్‌లో రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు గెలిచింది. ఒక దానిలో భారత్ నెగ్గింది.
- భారత్, దక్షిణాఫ్రికా మధ్య 83 వన్డేలు జరగగా... భారత్ 34 మ్యాచ్‌ల్లో గెలిచింది. దక్షిణాఫ్రికా 46 విజయాలు సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
జట్లు (అంచనా)
కోహ్లీ (కెప్టెన్), ధోని, రోహిత్, ధావన్, రాహుల్, హార్దిక్, బుమ్రా, షమి, భువనేశ్వర్, కుల్‌దీప్, జడేజా/జాదవ్
డుప్లెసిస్ (కెప్టెన్), డికాక్, ఆమ్లా, డసెన్, మిల్లర్, మోరిస్, డుమిని, రబాడ, తాహిర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్