ప్రపంచకప్‌లో పసికూనగా అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తనకంటే మేటి జట్టు దక్షిణాఫ్రికాను తొలి మ్యాచ్‌లోనే ఓడించింది. బుధవారం మరోసారి బలమైన ప్రత్యర్థితో తలపడేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిస్తే ఆ దేశ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్‌కు గొప్ప బహుమతి ఇచ్చినట్లే లెక్క. ఎందుకంటే ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.
ఇప్పటి వరకు 5వేల పరుగులు చేసి 250 వికెట్లు తీసుకున్నాడు షకిబ్. 2017లోనూ కివీస్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి ఛాంపియన్స్ ట్రీఫీ గెలుచుకోవడంలో షకిబ్ కీలక పాత్ర పోషించాడు.
" మేము ఈ ప్రపంచకప్‌కు ముందే ఏ ఛాలెంజ్‌లు ఎదుర్కొంటామో తెలుసుకున్నాం. దాని కోసం మేము బాగా సన్నద్ధమయ్యాం. అదే మాకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఈ ప్రపంచకప్‌లో మేము మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు బరిలోకి దిగాం. పెద్ద జట్లను ఓడించేందుకు మా దగ్గర కావాల్సినంత నైపుణ్యం ఉంది ".
--షకిబుల్ హసన్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్
గతమ్యాచ్‌లో షకిబ్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతోనే బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ తరఫున 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో క్రికెటర్‌గా షకిబ్ గుర్తింపు పొందునున్నాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా (208 మ్యాచ్‌లు), ముష్ఫికర్ రహీమ్ (206 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇలాంటి రికార్డుల కన్నా ఆటలోనే ఎక్కువ ఆనందం పొందుతానన్నాడు షకిబ్.
కివీస్ మంచి ఫామ్‌లో ఉంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చక్కని సమతూకంతో ఉంది. తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ 4 మ్యాచ్‌లు ఆడగా... అన్నింట్లో కివీసే గెలిచింది. రెండు జట్లు 35 వన్డేల్లో తలపడగా న్యూజిలాండ్ 24 గెలవగా, బంగ్లా 10 గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది.