తెలంగాణ

telangana

By

Published : May 23, 2019, 5:30 PM IST

ETV Bharat / sports

WC19: చివరి పంచ్​ ఇచ్చేందుకు సీనియర్లు సిద్ధం

ప్రపంచకప్​లో ఒక్కసారైనా జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి క్రికెటర్ కల. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి మెగా టోర్నీలో చివరిసారి బరిలోకి దిగుతున్నారు కొందరు క్రికెటర్లు. ఈ జాబితాలో గేల్, ధోని, మలింగ, తాహిర్, స్టెయిన్, మొర్తజా, షోయబ్ మాలిక్ లాంటి సీనియర్​ ఆటగాళ్లు ఉన్నారు. వారి ఆటతో పాటు అనుభవాన్ని జోడించి తమ జట్లను విజేతగా నిలిపేందుకు సన్నద్ధమవుతున్నారు.

WC19: చివరి పంచ్​ ఇచ్చేందుకు సీనియర్లు సిద్ధం

ప్రపంచకప్​లో చివరిసారి బరిలోకి దిగుతూ... సత్తా చాటి తమ దేశానికి కప్పు తేవాలని ఊవిళ్లూరుతున్న క్రికెటర్లు ప్రతి జట్టులోనూ ఉన్నారు. ఆ ప్రముఖుల గురించి ఓసారి పరిశీలిద్దాం.

గత ప్రపంచకప్​లు

క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌):

చాలా ఏళ్ల క్రితమే వన్డేల్లో అరంగేట్రం చేసినా ఇప్పటికీ కొనసాగుతున్న వారిలో గేల్‌ ఒకడు. విధ్వంసకర ఆటగాడిగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నా... విండీస్​ జట్టు ప్రపంచకప్​ విజయంలో మాత్రం భాగం కాలేకపోయాడు. కొంత కాలం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నా ఇప్పుడు మళ్లీ అవకాశం సంపాదించుకున్నాడు.

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే వరల్డ్‌ కప్‌లో గేల్‌ మెరుపులు ఖాయం. 2003 నుంచి 4 ప్రపంచ కప్‌లు ఆడిన గేల్‌.. 26 మ్యాచ్‌లలో 944 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. గత ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ బాదాడు.

క్రిస్​గేల్​​

మహేంద్ర సింగ్‌ ధోని (భారత్‌):

నాలుగున్నరేళ్ల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు ధోని. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికీ తనదైన ముద్ర వేస్తున్నాడు. కొంత కాలంగా అతని ఆటపై తీవ్ర విమర్శలు వచ్చినా... ఇటీవల ముగిసిన ఐపీఎల్​లో తను సారథిగా ఉన్న జట్టును ఫైనల్​ వరకు తీసుకెళ్లాడు. అందుకే ప్రపంచకప్​ లాంటి మెగాటోర్నీలో ధోని అనుభవం, వ్యూహాలు జట్టుకు చాలా అవసరం. 38 ఏళ్ల ధోని ఎలా ఆడినా అతడికి ఇదే ఆఖరి అంతర్జాతీయ టోర్నీ కావచ్చు.

ప్రపంచకప్​లో భారత జట్టుకు రెండు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. 2011లో జట్టును విజేతగా నిలిపాడు. 2015లో టీమిండియాను సెమీస్‌కు చేర్చాడు. మహీకి ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్‌. 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో 42.25 సగటుతో 507 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మహేంద్ర సింగ్​ ధోనీ

మొర్తజా (బంగ్లాదేశ్‌)

బంగ్లాదేశ్‌ జట్టు ఇన్నేళ్లుగా ఎక్కడో ఒక చోట సంచలనానికి కారణమవుతోందంటే అందుకు పునాది వేసిన వారిలో మొర్తజా ఒకడు. తన వన్డే కెరీర్‌లో ఎక్కువ భాగం కెప్టెన్‌గా వ్యవహరించిన మొర్తజా సమర్థంగా టీమ్‌ను నడిపించాడు. 2007 వరల్డ్‌ కప్‌లో భారత్‌ పతనానికి కారణమై ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన క్షణాన్ని ఎవరూ మరచిపోలేరు. గత ప్రపంచకప్‌లో అతని సారథ్యంలోనే ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎంపికైన అతను వరల్డ్‌ కప్‌ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. గాయంతో 2011 ప్రపంచ కప్‌కు దూరమైన అతను 2003 నుంచి 3 వరల్డ్‌ కప్‌లలో కలిపి 16 మ్యాచ్‌లలో 36.05 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు.

మొర్తజా

మలింగ (శ్రీలంక)

మూడు ప్రపంచ కప్‌లు... వరుసగా రెండు ఫైనల్స్‌లో పరాజయం. వన్డే ప్రపంచ కప్‌ను అందుకోలేని లంక అగ్రశ్రేణి క్రికెటర్లలో మలింగ ఒకడు. గాయాలతో 2016 మొత్తం ఆటకు దూరమై, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన పేసర్‌ ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్‌లో చోటు సంపాదించాడు. ఇటీవల ఐపీఎల్‌తో తన బౌలింగ్‌లో జోరు తగ్గలేదని చూపించాడు. ఈ మెగా టోర్నీ తర్వాత అతను పూర్తిగా టి20 లీగ్‌లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మూడు ప్రపంచ కప్‌లు ఆడిన మలింగ 22 మ్యాచ్‌లలో 21.11 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.

మలింగ

షోయబ్‌ మాలిక్‌ (పాకిస్థాన్‌):

సుదీర్ఘ కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాక్‌ కీలక ఆటగాళ్లలో మాలిక్‌ ఒకడు. 1999లోనే వన్డేల్లోకి అడుగు పెట్టిన ఈ ఆటగాడు.. వేర్వేరు కారణాలతో ఒకే ఒక్క ప్రపంచ కప్‌ (2007) ఆడగలిగాడు. 3 మ్యాచ్‌లలో కలిపి 92 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి ఈ సీనియర్​పై పాక్‌ భారీ అంచనాలు పెట్టుకుంది. వరల్డ్‌ కప్‌ తర్వాత మాలిక్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. తన 20 ఏళ్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ కెరీర్‌లో మాలిక్‌ 283 మ్యాచ్‌లు ఆడి 7522 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

షోయబ్​ మాలిక్​

సఫారీల కల నెరవేరేనా!

ఒకసారి కాదు...రెండు సార్లు కాదు... ప్రతి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఏదో కారణంతో కుప్పకూలిపోవడం రొటీన్‌గా మారిపోయింది. 1992 నుంచి అన్ని ప్రపంచ కప్‌లలో బలమైన జట్టుగా పోటీకి దిగినా చివరకు ఓటమి చెందడం అలవాటుగా మార్చుకుంది. అందుకే ‘చోకర్స్‌’గా సఫారీ జట్టుపై ముద్ర పడింది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి గుండె బద్దలైన క్షణాన సఫారీ జట్టు ఆటగాళ్లంతా చిన్నపిల్లల్లా రోదించారు. నాటి టీమ్‌లో భాగంగా ఉండి ఇప్పుడు ‘ఆఖరిసారి’ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఐదుగురు ఆటగాళ్లు సిద్ధమయ్యారు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు(హషీం ఆమ్లా, డు ప్లెసిస్‌, డేల్‌ స్టెయిన్‌, జేపీ డుమిని, ఇమ్రాన్‌ తాహిర్‌)

వీరందరికంటే ముందే నా వల్ల కాదు బాబోయ్.. ప్రపంచ కప్‌ లేకపోయినా నాకేమీ లోటు లేదంటూ ఏబీ డివిలియర్స్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించగా... డుప్లెసిస్, ఆమ్లా, డుమిని, స్టెయిన్, ఇమ్రాన్‌ తాహిర్‌ మరోసారి పోరాడనున్నారు (వీరంతా 2011, 2015లలో జరిగిన రెండు ప్రపంచ కప్‌లు ఆడారు). ఈసారైనా వీరి కల నెరవేరుతుందో వేచి చూడాలి.

  1. డుప్లెసిస్‌: 14 మ్యాచ్‌లలో 53.90 సగటుతో 539 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి.
  2. ఆమ్లా: 15 మ్యాచ్‌లలో 42.60 సగటుతో 639 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
  3. జేపీ డుమిని: 13 మ్యాచ్‌లలో 43.11 సగటుతో 388 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీ ఉన్నాయి.
  4. డేల్‌ స్టెయిన్‌: 14 మ్యాచ్‌లలో 23.39 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు.
  5. ఇమ్రాన్‌ తాహిర్‌: 13 మ్యాచ్‌లలో 16.31 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు.

ABOUT THE AUTHOR

...view details