సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ (122*) జట్టును ముందుండి నడిపించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. మరో 15 బంతులు మిగిలుండగానే భారత్ గెలిచింది.
వాహ్ వాహ్ రోహిత్...
మ్యాచ్ మొత్తానికి రోహిత్ ఇన్నింగ్సే హైలైట్. ఐపీఎల్, ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో విఫలమైన హిట్‌మ్యాన్... మెగాటోర్నీలో శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ధావన్ 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (18) తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అయినా రోహిత్ ఒత్తిడికి లోనవ్వలేదు. నిదానంగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. ఎంతో శ్రద్ధగా ఆడుతూ ఇన్నింగ్స్ చివరి వరకు ఉన్నాడు. రాహుల్‌తో విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన హిట్‌మ్యాన్ ఈ దశలోనే అర్ధశతకం నమోదు చేశాడు. అ తర్వాత కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. నలుదిశలా కళ్లుచెదిరే షాట్లతో విజృంభించాడు. రాహుల్ (26) ఔటైనా... ధోని (34)తో కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ దశలో ధోని ఔటయ్యాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (15*)తో కలిసి పని ముగించాడు హిట్‌మ్యాన్. చివరి వరకు నిలిచిన రోహిత్ 122 పరుగులు చేశాడు.