ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది వెస్టిండీస్. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని అఫ్గానిస్థాన్ విజయంతో టోర్నీని ముగిద్దామనుకుంటోంది. ఈ రెండింటి మధ్య హెడింగ్లే వేదికగామధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పసికూనపై పరాక్రమం చూపించేనా..
ఒక్క మ్యాచ్‌లోనే గెలిచిన వెస్టిండీస్ 3 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. క్రిస్ గేల్, హోప్, బ్రాత్‌వైట్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
రసెల్ జట్టుకు దూరం కావడం విండీస్‌కు కోలుకోలేని దెబ్బ. తొలి రెండు ప్రపంచకప్‌లలో ఛాంపియన్లుగా నిలిచిన వెస్టిండీస్ మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చేతులెత్తేస్తోంది.
ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్‌తో మినహా మిగతా జట్లపై పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో చివరి వరకు పోరాడి త్రుటిలో విజయం చేజార్చుకుంది. పేరుకు విధ్వంసకారులున్నా.. సమష్టిగా ఆడటంలో కరీబియన్ జట్టు విఫలమైంది. బౌలింగ్‌లో కాట్రెల్, థామస్ లాంటి వారు ఆకట్టుకుంటున్నా..నిలకడ లోపిస్తోంది. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.