తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: టీమిండియాకు బంగ్లా నేర్పిన పాఠం

బర్మింగ్​హామ్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్​లో భారత్ విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు నేర్పిన పాఠం టైటిల్​ ఫేవరెట్​గా మనకు గుర్తుండిపోయేదే. ఇప్పటికే జట్టు కూర్పుపై చాలా ప్రశ్నలు తలెత్తుతుండగా... నాలుగో స్థానం, మిడిల్ ఆర్డర్​లో ఎవరూ నిలకడగా రాణించట్లేదు.

టీమిండియాకు బంగ్లా నేర్పిన పాఠం

By

Published : Jul 3, 2019, 11:52 AM IST

ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​తో పోరు మినహా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది భారత్​. బలమైన ఆసీస్​ను ఓడించింది. పాకిస్థాన్​కు మరోసారి పరాజయాన్ని రుచి చూపించింది. బంగ్లాపై నెగ్గింది. సెమీస్ చేరింది. ఇంక అంతేనా.. జట్టు పటిష్ఠంగా ఉందా? టీమిండియాలో లోపాలే లేవా? మిడిల్ ఆర్డర్​ బలంగా ఉందా? అనే ప్రశ్నలు ఎదురైతే మాత్రం ఆలోచించాల్సిందే. రెండో ఇన్నింగ్స్​ చివర్లో టెయిలెండర్లతో బంగ్లా ఆద్భుత ప్రదర్శన చేసింది.

బంగ్లాపై గెలిచింది అంతే..

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో భారత్ నామామాత్రపు విజయాన్నే అందుకుంది. పసికూన లాంటి జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్​పై గెలిచేంత పనిచేసింది. 179 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బంగ్లా. ఇంకేముంది మరో 30, 40 పరుగులు చేసి బంగ్లా ఆలౌటౌతుంది అనుకునే ఉంటారు. కానీ చివరి 4 వికెట్లు తీయడానికి మాత్రం భారత్ చెమట చిందించాల్సి వచ్చింది. టెయిలెండర్లను ఔట్ చేసేందుకు భారత్​ చివర్లో 107 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మహ్మద్ సైఫూద్దీన్(51), సబ్బీర్ రెహమాన్(36) ఎదురుదాడికి దిగి భారత్ అభిమానుల గుండెల్లో గుబులు రేపారు. గెలుపు కోసం అన్ని విధాలా పోరాడారు.

వారు 107.. మనం 16 పరుగులే..

భారత్ బ్యాటింగ్​కు వస్తే ఓపెనర్లు 180 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఆరంభాన్ని టీమిండియా వినియోగించుకోలేకపోయింది. 237 వరకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్... ఇన్నింగ్స్​ ముగిసేసరికి మరో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది. గొప్ప ఆరంభాన్ని భారీ స్కోరుగా మల్చడంలో మిడిల్ ఆర్డర్ విఫలమైంది. ఇదే సమయంలో బంగ్లా చివరి నాలుగు వికెట్లు చేతిలో ఉంచుకుని 107 పరుగులు చేసింది. కానీ టీమిండియా విషయానికొస్తే చివరి నలుగురు బ్యాట్స్​మెన్ చేసిన స్కోరు 16 పరుగులు మాత్రమే.

ఓపెనర్లు ఆడితేనే టీమిండియా భారీ స్కోరు చేసే పరిస్థితి నెలకొంది. నాలుగో స్థానంలో ఉన్న సమస్య మిడిల్ ఆర్డర్, లోయర్​ ఆర్డర్​కూ పాకింది. మిడిల్ ఆర్డర్​లో పాండ్య డకౌట్ కాగా.. దినేశ్ కార్తీక్ 8 పరుగులే చేశాడు. ధోనీ ఓ మోస్తరుగా 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇంక మన టెయిలెండర్లు వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు.

ఇదే పరిస్థితి ప్రపంచకప్ సెమీస్, ఫైనల్​ మ్యాచ్​లో పునరావృతమైతే టీమిండియా 2019 వరల్డ్​కప్​ ఆశ.. కల గానే మిగిలి పోయే ప్రమాదముంది. ఇప్పటికైనా జట్టు కూర్పుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో చివర్లో చేతులెత్తిసిన భారత బ్యాట్స్​మెన్.. బంగ్లా ఆటగాళ్లను చూసి నేర్చుకోవాల్సిందే.

ఇదీ చూడండి: చెమటోడ్చి సెమీస్ చేరిన భారత్​

ABOUT THE AUTHOR

...view details