తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: ఈ దిగ్గజాలు ప్రపంచకప్​ అందుకోలేకపోయారు..!

క్రికెట్​ చరిత్రలో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న చాలామంది క్రికెటర్లు ప్రపంచకప్​ను మాత్రం దక్కించుకోలేకపోయారు. దగ్గర వరకు వచ్చి వెనుదిరిగిన వాళ్లు కొంతమంది కాగా, దురదృష్టంతో దూరమైన వాళ్లు మరికొంతమంది. అలాంటి ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

ప్రపంచకప్​ దిగ్గాజాలు

By

Published : May 27, 2019, 5:30 AM IST

ప్రపంచకప్​.. చేతిలోకి తీసుకుని ముద్దాడాలని ప్రతీ క్రికెటర్​ కలలు కంటాడు. అందుకోసం మైదానంలో చెమటను చిందిస్తాడు. కానీ కొంతమందే ఆ కలను నిజం చేసుకోగలుగుతారు. జట్టుగా ఆడినప్పుడే వరల్డ్​కప్​ను చేజిక్కించుకునే అవకాశం దొరుకుతుంది. ఇలా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ బ్యాటింగ్ వాడిని చూపించినా.. మెగాటోర్నీని దక్కించుకోలేకపోయిన కొంతమంది దిగ్గజ క్రికెటర్ల గురించి ఇప్పుడు చూద్దాం!

సౌరవ్​ గంగూలీ..

సౌరవ్​ గంగూలీ..

1999 నుంచి 2007 వరకు మూడు ప్రపంచకప్​లు ఆడిన సౌరవ్ గంగూలీ వరల్డ్​కప్​ కల మాత్రం తీర్చుకోలేకపోయాడు. 2003లో తన సారథ్యంలో ఫైనల్​ వరకు చేరగలిగినా.. నిరాశే మిగిలింది. ఈ టోర్నీలో గంగూలీ మూడు శతకాలతో ఆకట్టుకున్నాడు. 2007లో భారత్​ లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2011లో టీమిండియా ప్రపంచకప్​ సాధించినప్పటికీ గంగూలీ అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్​ టోర్నీల్లో 22 మ్యాచ్​లాడిన గంగూలీ 55.88 సగటుతో 1006 పరుగులు చేశాడు.

కుమార సంగక్కర..

కుమార సంగక్కర..

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కుమార సంగక్కర. నాలుగు ప్రపంచకప్​లు ఆడిన సంగక్కరకు వరల్డ్​కప్​ ఆశ తీరలేదు. 2007, 2011 టోర్నీల్లో శ్రీలంక ఫైనల్ వరకు​ చేరినా.. ప్రపంచకప్​ను ముద్దాడలేకపోయాడు. చివరగా 2015 ప్రపంచకప్​లో క్వార్టర్స్​లో దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది శ్రీలంక. ఈ మ్యాచ్​ తర్వాత సంగక్కర రిటైర్మెంట్ ప్రకటించాడు. శ్రీలంక 1996 వరల్డ్​కప్​ను సొంతం చేసుకోగా.. అప్పటికి సంగక్కర అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేయలేదు.

బ్రయన్​ లారా..

బ్రయన్​ లారా..

టెస్టు క్రికెట్​ చరిత్రలో తనదైన ముద్రవేసిన బ్రయన్ లారా ఆ స్థాయిలో కాకపోయిన వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. 299 వన్డేలాడిన ఈ విండీస్ దిగ్గజం 10వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించే లారా ప్రపంచకప్​ను మాత్రం అందుకోలేకపోయాడు. 1975, 1978 ప్రపంచకప్​ విజేతగా నిలిచిన విండీస్ ఆ తర్వాత టైటిల్​ను అందుకోలేదు.

జాక్వస్ కలీస్​...

జాక్వస్ కల్లీస్​...

ప్రపంచ క్రికెట్​లో ఉన్న నాణ్యమైన ఆల్​రౌండర్లలో జాక్వస్ కలీస్​ ఒకడు. సనత్ జయసూర్య తర్వాత టెస్టు, వన్డే రెండు ఫార్మాట్​ల్లో పదివేల పరుగులతో పాటు 250కు పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కలీస్​ రికార్డు సృష్టించాడు. 17 శతకాలు, 86 అర్ధ శతకాలు చేసిన కలీస్​​కు ప్రపంచకప్​ కల తీరలేదు. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్​ గెలవలేకపోయింది.

ఏబీ డివిలియర్స్...

ఏబీ డివిలియర్స్...

మైదానంలో బ్యాట్​తో అన్ని వైపుల చెలరేగి ఆడే డివిలియర్స్ వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు. అబ్బురపరిచే షాట్లతో ఈ తరం ఆటగాళ్లకు స్ఫూర్తినింపే ప్లేయర్ డివిలియర్స్​. వెస్టిండీస్​పై 31 బంతుల్లో శతకం చేసి ప్రపంచంలోనే వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫార్మాట్​ ఏదైనా బౌలర్లకు నిద్రపట్టనీయకుండా విధ్వంసం సృష్టించడంలోఈ దక్షిణాఫ్రికా ఆటగాడు దిట్ట. అయితే సౌతాఫ్రికాకు ప్రపంచకప్​ కల మాత్రం నెరవేర్చలేకపోయాడు. 1996, 1999, 2015లో సెమీస్​ వరకు చేరినా ఫైనల్​కు మాత్రం వెళ్లలేకపోయింది దక్షిణాఫ్రికా.

షాహిద్ అఫ్రిదీ...

షాహిద్ అఫ్రిదీ...

1996లో అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేసిన షాహిద్​ అఫ్రిదీ ప్రపంచకప్​ను ముద్దాడలేకపోయాడు. 37 బంతుల్లోనే వేగంవంతమైన శతకం చేసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును చాలారోజుల పాటు ఎవ్వరూ దరిచేరలేకపోయారు. బ్యాటింగ్​లోనే కాకుండా తన స్పిన్​ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేయగల సమర్థుడు అఫ్రిదీ. వన్డేల్లో 398 వికెట్లు తీసిన అఫ్రిదీకీ ప్రపంచకప్ అందని ద్రాక్షలాగే మిగిలింది. 1992 పాక్​ ప్రపంచకప్​ నెగ్గినా.. అప్పటికీ అఫ్రిదీ ఇంకా అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేయలేదు.

వకార్ యూనీస్​..

వకార్ యూనీస్​..

పాకిస్థాన్ 1992 ప్రపంచకప్​ను సొంతం చేసుకుంది. అయితే ఆ జట్టులో వకార్ సభ్యుడిగా ఉన్నప్పటికీ వరల్డ్​కప్​ సంబరాలకు దూరమయ్యాడు. గాయం కారణంగా వకార్ ఫైనల్​ మ్యాచ్ ఆడలేదు. ఇంకో విశేషమేంటంటే 1992 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా వకార్ రికార్డు సృష్టించాడు. 1999లోనూ ఆస్ట్రేలియాతో ఫైనల్​లో తలపడి పాకిస్థాన్ ఓటమి చవిచూసింది. అప్పుడూ కూడా వకార్ జట్టులో ఉన్నాడు. ఈ కారణంగా రెండు సార్లు ప్రపంచకప్​ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయాడు వకార్.

ABOUT THE AUTHOR

...view details