ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క విజయం నమోదు చేసిన వెస్టిండీస్ ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించింది. అలాగే టీమిండియాపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో శ్రీలంకకు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం అయింది. ఈ రెండింటి మధ్య చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
లంక నిలవాలంటే గెలవాల్సిందే...
అఫ్గాన్, ఇంగ్లాండ్ మినహా మిగతా జట్లపై పరాజయం చెందిన శ్రీలంక సెమీస్ చేరడం ఎంతో కష్టం. ఏడు మ్యాచ్‌లు ఆడిన లంక జట్టు... మిగిలిన రెండింటిలో భారీ విజయం సాధించాలి. ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తాము ఆడాల్సిన మ్యాచుల్లో భారీ తేడాతో పరాజయం చెందితే తప్ప శ్రీలంకకు అవకాశం ఉండదు. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో గెలిచినట్లయితే లంకేయులకు సెమీస్ అవకాశం ఇంత కష్టంగా ఉండేది కాదు. కానీ అందులో ఓడిపోయింది.
ఈ ప్రపంచకప్‌లో లంక అంతగా రాణించలేదు. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవడం ఆ జట్టుకు కలిసొచ్చింది. బ్యాటింగ్‌లో కరుణరత్నే, కుశాల్ పెరీరా, అవిష్కా ఫెర్నాండో, మ్యాథ్యూస్ మినహా ఈ టోర్నీలో మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్‌లో ఓ మోస్తరుగా రాణించింది. అది కూడా మలింగ లాంటి స్టార్ పేసర్ ఉండటమే. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుతం విండీస్‌పై సత్తాచాటి సెమీస్ చేరేందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది లంక.