దక్షిణాఫ్రికా... 'చోకర్స్' అని కొందరు పిలుస్తుంటారు. ఈ ప్రపంచకప్‌లో రాణించి ఆ పేరు పోగొట్టుకోవాలని భావించారు సఫారీలు. కానీ కప్పు కాదు కదా కనీసం సెమీస్‌లో అడుగుపెట్టలేకపోయారు. 1992 నుంచి దండయాత్ర చేస్తున్న దక్షిణాఫ్రికా మరోసారి అభిమానుల్ని నిరాశపరిచింది.
ఈ జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లు అందరూ ఉన్నారు. కప్పు కొట్టేందుకు అన్ని వనరులు ఉన్నాయి. అయితే ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ జట్టు కంటే పాకిస్థాన్, శ్రీలంక మెరుగ్గా ఆడి ముందంజలో నిలిచాయి.
ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది దక్షిణాఫ్రికా. అఫ్గానిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై గెలిచింది. వెస్టిండీస్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ప్రపంచకప్‌కు ముందు పెద్ద జట్లపై అద్భుతమైన విజయాలను నమోదు చేసిన సఫారీలు.. మెగా టోర్నీలో మాత్రం చేతులెత్తేశారు. ఇందులో దక్షిణాఫ్రికా ఓటమికి గల కారణాలను ఓ సారి పరిశీలిద్దాం..
గాయాల బెడద
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి గాయాలు సఫారీ ఆటగాళ్లను వేధించాయి. టోర్నీలో ఆడేందుకు సిద్ధమైన సీనియర్ పేసర్ డేల్ స్టెయిన్.. ఒక్క మ్యాచ్ ఆడుకుండానే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.
స్టెయిన్- ఎంగిడి-రబాడా త్రయంతో ప్రత్యర్థుల్ని ఓడించవచ్చని అనుకున్నాడు డుప్లెసిస్. కానీ స్టెయిన్‌కు, ఆ తర్వాత ఎంగిడికి వరుసగా గాయాలు కావడం జట్టు సభ్యుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
ప్రదర్శన అంతంత మాత్రమే..
బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ డుప్లెసిస్(387 పరుగులు), డికాక్(305) మినహా మరెవరూ రాణించలేదు. ఓపెనర్ హషీమ్ ఆమ్లా మొత్తంగా 7 మ్యాచ్‌లాడి కేవలం 203 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఆల్‌రౌండర్ల విభాగంలో మోరిస్, డుమిని.. ఈ ప్రపంచకప్‌లో అనుకున్నంత మేర ఆడలేకపోయారు. 5 మ్యాచ్‌లాడిన డుమిని.. 70 పరుగులు చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. మోరిస్.. 13 వికెట్లు తీసి బౌలింగ్‌లో ఫరవాలేదనిపించాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 74 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.
అత్యుత్తమ బౌలర్లు రబాడా, తాహిర్.. ప్రపంచకప్‌లో ప్రత్యర్ధి జట్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9 మ్యాచ్‌లాడిన వీరిద్దరూ చెరో 11 వికెట్లు మాత్రమే తీయగలిగారు.
చెత్త ఫీల్డింగ్.. బ్యాటింగ్
ఈ ప్రపంచకప్ మొత్తంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీ మినహా.. జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ కనీసం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు.
డివిలియర్స్ వస్తానంటే వద్దన్నారు...
దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. రిటైర్మెంట్ ప్రకటించిన ఈ క్రికెటర్.. ప్రపంచకప్‌లో ఆడేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పాడు. అయినా అతడి అభ్యర్ధనను మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ అతడ్ని జట్టులోకి తీసుకున్నా ఫలితం వేరేలా ఉండేదేమో..!
ఈ మెగాటోర్నీయే తమకు చివరిదని ఇప్పటికే తాహిర్, డుమిని ప్రకటించేశారు. జట్టులోని ఆమ్లా, డుప్లెసిస్ తర్వాతి ప్రపంచకప్‌లో కనిపించకపోవచ్చు. కాబట్టి వచ్చేసారికైనా తమ ప్రదర్శన మార్చుకుని సఫారీలు కప్పు కొడతారేమో చూడాలి.
ఇది చదవండి: WC19: దక్షిణాఫ్రికా అనూహ్య ఓటములు