ప్రపంచకప్ టోర్నీలోని తన చివరి లీగ్ మ్యాచ్ అనంతరం వన్డే క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు పాక్ జట్టు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ క్రికెటర్... వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
భారత్‌పై గోల్డెన్ డకౌట్...
ప్రస్తుత ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు షోయబ్ మాలిక్. ఆల్‌రౌండర్‌గా.. 15 మంది జట్టు సభ్యుల జాబితాలో చోటు లభించినా ఆశించిన మేర ప్రతిభ చూపించలేకపోయాడు. 3 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు దిగి మొత్తం 8 పరుగులే చేశాడు. వాటిలో రెండు డకౌట్లు (ఆస్ట్రేలియా, భారత్) ఉన్నాయి. చివరిగా ఈ వరల్డ్‌కప్‌లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జూన్ 16న టీమిండియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు షోయబ్. అదే అతనికి చివరి మ్యాచ్.
37 ఏళ్ల మాలిక్ 2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 287 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్.. 34.55 సగటుతో 7 వేల 534 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి 158 వికెట్లు పడగొట్టాడు. 35 టెస్టులు ఆడిన ఈ సీనియర్ క్రికెటర్... 1898 పరుగులు చేసి 32 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఐసీసీ ప్రపంచకప్ 2019లో పాకిస్థాన్ జట్టు 11 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో సమానంగా పాయింట్లు సాధించినా... నెట్ రన్‌రేట్ తేడాతో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.