తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన రహీమ్​, షకిబ్​- అఫ్గాన్​ లక్ష్యం 263 - ప్రపంచకప్​

సౌతాంప్టన్​ వేదికగా అఫ్గానిస్థాన్​తో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 262 పరుగులు చేసింది. ముష్ఫికర్​ రహీమ్​ (83), షకిబ్​ ఉల్ హసన్​ (51) పరుగులతో సత్తా చాటాడు. అఫ్గాన్​ బౌలర్లలో ముజిబ్​ ఉర్​ రెహ్మాన్​ 3, నయీబ్​ 2 వికెట్లతో రాణించారు.

రాణించిన రహీమ్​, షకిబ్​- అఫ్గాన్​ లక్ష్యం 263

By

Published : Jun 24, 2019, 7:44 PM IST

సెమీస్​ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ బ్యాట్స్​మెన్​ రాణించారు. అఫ్గాన్​ స్నిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేసినప్పటికీ... బంగ్లా బ్యాట్స్​మెన్​ స్ట్రైక్​ రొటేట్​ చేస్తూ రన్​రేట్​ తగ్గకుండా చూసుకున్నారు. ఇన్నింగ్స్​ మొత్తంలో ఒకే ఒక సిక్సర్​ కొట్టినప్పటికీ బంగ్లా మంచి స్కోరు సాధించగలిగింది.

ఆది నుంచి...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకొన్న బంగ్లా ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచి ఓవర్​కు 6 పరుగుల చొప్పున వచ్చేలా చూసుకుంది. జట్టు 23 పరుగుల వద్ద లిటన్​ దాస్​ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్ షకిబ్​ ఉల్​ హసన్ (51)​ మరోసారి విలువైన ఇన్నింగ్స్​ ఆడాడు. తమీమ్​తో కలిసి రెండో వికెట్​కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కీలక భాగస్వామ్యం...

అనంతరం తమీమ్​(36)ను నబీ బోల్తా కొట్టించి బౌల్డ్​ చేశాడు. నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్​ (83), షకిబ్​కు మంచి సహకారం అందించాడు. ఈ జోడీ మూడో వికెట్​కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది.

అర్ధశతకం చేసిన షకిబ్​ను ముజీబ్​ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్ (3)ను కాసేపటికే ముజీబ్​ ఔట్ చేశాడు.

ముష్ఫికర్​ ఒక్కడే...

ఓ పక్క వికెట్లు కాపాడుకుంటూ... మరో పక్క స్ట్రైక్ రొటేట్​ చేస్తూ రహీమ్​ విలువైన ఇన్నింగ్స్​ ఆడాడు. మహ్మదుల్లా (27) ఫర్వాలేదనిపించాడు. ముష్ఫికర్ 49వ ఓవర్లో భారీ షాట్​కు యత్నించి జద్రాన్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔటయ్యాడు. మహ్మదుల్లా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మొసాద్దిక్ (35*) చివర్లో బ్యాట్​ ఝుళిపించడం వల్ల బంగ్లా మంచి స్కోరు సాధించగలిగింది.

అఫ్గాన్​ బౌలర్లలో ముజిబ్​ ఉర్​ రెహ్మాన్​ 3, నయీబ్​ 2 వికెట్లతో రాణించారు. నబీ, జద్రాన్​కు తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

రికార్డులు...

⦁ ప్రపంచకప్​ కెరీర్​లో​ 1000 పరుగుల పూర్తి చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా షకిబ్​ రికార్డులకెక్కాడు.

⦁ మొత్తంగా ఈ మార్కు అందుకున్న వారిలో 19వ ఆటగాడు షకిబ్​.

⦁ ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా వార్నర్​ను వెనక్కి నెట్టాడు షకిబ్.

ABOUT THE AUTHOR

...view details