తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలపై పాక్​ జయకేతనం- సెమీస్​ ఆశలు సజీవం

లార్డ్స్​ మైదానంలో పాకిస్థాన్​ జయకేతనం ఎగురవేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో పాక్​ జట్టు సమష్టి పోరాటం చేసి 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్​... 259 పరుగులకే పరిమితమయింది. పాక్​ బ్యాట్స్​మెన్​ సోహేల్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ లభించింది.

సోహైల్​ సొగసైన ఇన్నింగ్స్​... సఫారీలకు మరో ఓటమి

By

Published : Jun 24, 2019, 12:02 AM IST

Updated : Jun 24, 2019, 1:12 AM IST

పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా హెలెట్స్​

టీమిండియాతో ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకున్న పాకిస్థాన్​ తర్వాతి మ్యాచ్​లో సత్తా చాటింది. దక్షిణాఫ్రికా జట్టుపై బంతితోనూ, బ్యాట్​తోనూ ఆధిపత్యం ప్రదర్శించి జయకేతనం ఎగురవేసింది. సఫారీలపై 49 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. 309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్లు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేశారు. డుప్లెసిస్​ అర్ధశతకంతో రాణించగా... డికాక్​, ఫెలుక్వాయో మంచి ఇన్నింగ్స్​ ఆడినా దక్షిణాఫ్రికాను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. సఫారీలపై విజయంతో పాక్​ సెమీస్​ ఆశలు సజీవంగా నిలుపుకొంది.

సారథి ఒంటరి పోరాటం...

309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే సఫారీలకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్​ బ్యాట్స్​మెన్​ ఆమ్లా.. ఆమిర్​ బౌలింగ్​లో ఎల్బీగా ఔటయ్యాడు. డుప్లెసిస్​తో​ మంచి ఇన్నింగ్స్​ నిర్మించి జోరు పెంచే క్రమంలో... భారీ షాట్​కు యత్నించి వెనుదిరిగాడు డికాక్​. మార్కరమ్​ 7 పరుగులకే ఔటవ్వడం వల్ల ఒత్తిడిలో పడింది ప్రొటీస్​ జట్టు. కీలక సమయంలో సారథి డుప్లెసిస్​ 79 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో డుస్సెన్​ (36), మిల్లర్​ (31), ఫెలుక్వాయో (46), మోరిస్​ (16) కాస్త ఫర్వాలేదనిపించినా పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు.

వరుస ఓవర్లలో మూడు...

పాక్​ బౌలర్​ రియాజ్​ చివరిగా వేసిన తన మూడు ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. ఔటైన అందరినీ బౌల్డ్​ చేయడం విశేషం. 44వ ఓవర్​లో మోరిస్​, 46వ ఓవర్​లో రబాడ, 48వ ఓవర్​లో ఎన్​గిడి వికెట్లు తీసుకున్నాడు.

పాక్​ బౌలర్లలో ఆమిర్​ మరోసారి 2 కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. మరో బౌలర్​ షాదాబ్​ ఖాన్​ 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్​తో కెరీర్​లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షాదాబ్​. మరో బౌలర్​ షాహిన్​ అఫ్రిది ఒక వికెట్​ తన ఖాతాలో వేసుకున్నాడు.

సోహేల్​ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​...

ఓపెనర్​ ఇమాముల్​ హక్​ 44 పరుగులు ( 58 బంతుల్లో; 6 ఫోర్లు) ఫకర్​ జమాన్ 44 పరుగులు ( 50 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్​​) చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్​గా జమాన్​​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బాబర్​ అజాం 69 పరుగులు ( 80 బంతుల్లో; 7 ఫోర్లు) మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. పాక్​ మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్​ హారిస్​ సోహేల్​ 89 పరుగులు (59 బంతుల్లో; 9 ఫోర్లు, 3 సిక్సర్లు​) వేగవంతమైన బ్యాటింగ్​ వల్లే 300 పైచిలుకు లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది పాక్​. కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టి సిక్సర్లు, ఫోర్లతో భారీగా పరుగులు రాబట్టాడు హారిస్. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది పాక్​. సోహేల్​ 150.84 స్ట్రైక్​ రేటుతో ప్రపంచకప్​లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు​.

  • జెర్సీ పరుగులు ఒకటే...

సోహేల్​ ఈ మ్యాచ్​లో 89 పరుగులు చేయగా... అతడి జెర్సీ నంబర్​ 89 కావడం విశేషం.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్​గిడి 3 వికెట్లు, తాహిర్​ 2 వికెట్లు ఏయిడెన్‌ మార్‌క్రమ్‌, ఫెలుక్వాయో తలో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు. తాహిర్​ ఈ మ్యాచ్​లో ప్రపంచకప్​లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Last Updated : Jun 24, 2019, 1:12 AM IST

ABOUT THE AUTHOR

...view details