తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన సొహేల్​... సఫారీల లక్ష్యం 309 - లార్డ్స్​ వేదికగా దక్షిణాఫ్రికా

లార్డ్స్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పోరులో పాకిస్థాన్​ జట్టు బ్యాటింగ్​లో రాణించింది. ప్రత్యర్థి ప్రొటీస్​ ముందు 309 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. పాక్​ బ్యాట్స్​మెన్లలో హారిస్‌ సోహేల్‌, బాబర్​ అజాం అర్ధశతకాలు సాధించారు.

సొహేల్​ అదరహో... సఫారీలకు భారీ లక్ష్యం

By

Published : Jun 23, 2019, 7:37 PM IST

లండన్​లోని లార్డ్స్​ మైదానంలో పరుగుల వరద పారింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. సఫారీలు గెలవాలంటే 309 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు సహా బాబర్​, సోహేల్​ సమష్టిగా పోరాడి భారీ స్కోరు దిశగా పాక్​ జట్టును నడిపించారు.

ఆరంభం అదిరె...

ఓపెనర్​ ఇమాముల్​ హక్​ 44 పరుగులు ( 58 బంతుల్లో; 6 ఫోర్లు) ఫకర్​ జమాన్ 44 పరుగులు ( 50 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్​​) చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్​గా జమాన్​​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బాబర్​ అజాం 69 పరుగులతో ( 80 బంతుల్లో; 7 ఫోర్లు) మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. మిడిలార్డర్​లో రాణించి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు.

చెలరేగిన సోహేల్​...

పాకిస్థాన్​ బ్యాట్స్​మెన్లు హాఫీజ్​ (20), ఇమాద్ వసీం(23) తక్కువ పరుగులే చేసినా వారి సహకారంతో హారిస్​ సోహేల్​ 89 పరుగులు(59 బంతుల్లో; 9 ఫోర్లు, 3 సిక్సర్లు​) చేశాడు. వేగవంతమైన బ్యాటింగ్​ వల్లే 300 పైచిలుకు లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది పాక్​.

  1. సొహేల్​ 150.84 స్ట్రైక్​ రేటుతో ప్రపంచకప్​లో అత్యుత్తమ గణాంకాన్ని నమోదు చేశాడు​. ప్రపంచకప్​లో భారీ సగటుతో పరుగులు చేసిన పాక్​ ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానం సంపాదించాడు. ఇమ్రాన్​ఖాన్(169.69)​, ఇంజమామ్​(162.16) తర్వాత సొహేల్​ ఉన్నాడు.
  2. 5వ స్థానం కన్నా తక్కువలో వచ్చి భారీ పరుగులు చేసిన పాక్​ ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం సంపాదించాడు సొహేల్​(88). గతంలో 1983 ప్రపంచకప్​లో ఇమ్రాన్​ఖాన్​ 102 పరుగులు చేశాడు.
  3. 2018 జనవరి నుంచి 14 ఇన్నింగ్స్​లు ఆడిన హారిస్​.. 607 పరుగులు చేశాడు. వాటిలో 2 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. 130 అత్యధిక స్కోరు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్​గిడి 3 వికెట్లు, తాహిర్​ 2 వికెట్లు, ఏయిడెన్‌ మార్‌క్రమ్‌, ఫెలుక్వాయో తలో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచకప్​లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఛేదించిన అత్యధిక స్కోరు 297 పరుగులు. 2011లో నాగపూర్​లో జరిగిన మ్యాచ్​లో భారత్​పై ఈ ఘనత సాధించింది.

ABOUT THE AUTHOR

...view details