వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా కనుమరుగైన వేళ... ఎక్కడో చిన్నపాటి ఆశతో బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమవుతోంది పాకిస్థాన్. శుక్రవారం లార్డ్స్ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి కారణంగా పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. అదే ఆతిథ్య జట్టు చేతిలో న్యూజిలాండ్ పరాభవంతో సర్ఫ్రాజ్ సేన ఇంటికెళ్లిపోవడందాదాపు ఖరారైపోయింది.
టాస్ కీలకం...
పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే బంగ్లాదేశ్‌తో జరిగే పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో మహాద్భుత విజయాన్ని ఆ జట్టు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఫీల్డింగ్ చేస్తే ఒక్క బంతి పడకుండానే పాక్ సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. అందుకే ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం ఆ జట్టుకు తప్పనిసరి.
గెలిస్తే అద్భుతమే...
ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసినా పాకిస్థాన్ సెమీస్‌కు చేరడం అంత సులువేం కాదు. పాక్ 350 పరుగులు చేస్తే బంగ్లాదేశ్‌ను 39 పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ 400 రన్స్ చేస్తే 316 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం.
రన్‌రేట్‌తో పాక్‌కు కష్టాలు...
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు నెట్ రన్‌రేట్ + 0.175గా ఉంది. పాకిస్తాన్ ఖాతాలో 9 పాయింట్లు ఉండగా వారి నెట్ రన్‌రేట్ -0.792గా ఉంది. బంగ్లాదేశ్‌పై పాక్ నెగ్గి... న్యూజిలాండ్‌తో సమానంగా 11 పాయింట్లు సాధించినా నెట్ రన్‌రేట్‌లో వెనుకంజలోనే ఉంటుంది.