ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ అనూహ్య ఓటమి చవిచూసింది. కొద్దిలో ట్రోఫీని చేజార్చుకున్న కివీస్ ఆటగాళ్ల బాధ వర్ణణాతీతం. ఈ విషయంపై ఆ జట్టు సారథి విలియమ్సన్ స్పందిస్తూ అదో పీడకలలా ఉందని అన్నాడు. మ్యచ్ ఇలా ఓడటం చాలా బాధగా ఉందని.. ఆటగాళ్లు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారని తెలిపాడు.
బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ విజయం సాధించడం అనే నియమం సరైనదేనా అన్న ప్రశ్నకు.. "ఇందుకు నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని.. నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు" అని అన్నాడు.
"ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు చాలా కష్టపడ్డాయి. బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి నిబంధనతో మ్యాచ్ ఫలితం తేల్చాల్సి వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’"
-విలియమ్సన్, కివీస్ సారథి
ఫైనల్ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ.. "ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు" అని విలియమ్సన్ తెలిపాడు.
ఇవీ చూడండి.. టీమిండియాకు కోచ్, టీమ్ మేనేజర్ కావలెను..!