ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ మార్కు అందుకున్న ఆటగాడిగా ఘనత సాధించాడు. అయితే శనివారం సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో మరో రికార్డు అతడి ముందు ఊరిస్తోంది. అదే కెరీర్లో 20వేల పరుగుల మార్కు.
ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 19వేల 896 పరుగులు ఉన్నాయి. మరో 104 పరుగులు చేస్తే 20వేల మార్కు అందుకునే అవకాశం ఉంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత అందుకుంటే 415 ఇన్నింగ్స్‌లోనే వేగంగా ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా పేరు తెచ్చుకోనున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు 131 టెస్టులు, 222 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
దిగ్గజాలతో పోటీ...
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 20వేల మార్కు అందుకున్న క్రికెటర్లు పదకొండు మంది మాత్రమే. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా ఈ ఘనతను సాధించారు. ఈ ఇద్దరూ 453 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు అందుకున్నారు. వీరిద్దరి తర్వాత రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) ఇదే మార్కును 468 ఇన్నింగ్స్‌లలో సాధించాడు.
ఈ జాబితాలో ఈ ముగ్గురితో పాటు సంగక్కర(శ్రీలంక), జయవర్దనే(శ్రీలంక), కలిస్(దక్షిణాఫ్రికా), ద్రవిడ్(భారత్), జయసూర్య(శ్రీలంక), చంద్రపాల్ (వెస్టిండీస్), ఇంజమామా ఉల్ హక్(పాకిస్థాన్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) విరాట్ కోహ్లీ కన్నా ముందున్నారు.
ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు కింగ్ కోహ్లీ. వన్డేల్లో 59.96 సగటుతో ఉన్న విరాట్... ఈ మెగాటోర్నీలో ఆస్ట్రేలియాపై 82 పరుగులు, పాకిస్థాన్‌పై 77 పరుగులు సాధించాడు. జూన్ 16న పాకిస్థాన్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో బరిలోకి దిగిన కోహ్లీ... వన్డేల్లో 11వేల మైలురాయిని అందుకున్నాడు. ఈ మార్కు అందుకున్న 9వ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు కోహ్లీ.